Bryan Johnson Plasma| నిత్య యవ్వనం కోసం గత కొన్ని సంవత్సరాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్న అమెరికా వ్యాపారవేత్త బ్రియన్ జాన్సన్ మళ్లీ భారీ ప్రయోగమే చేశాడు. మానవ శరీరంలో ప్రాణాధారమైన ప్లాస్మానే తొలగించేశాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త బ్రియాన్ జాన్సన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆయనకు ముసలితనం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలనే ఆశయంతో ఆయన నిరంతరం కృషి చేస్తుంటారు. ప్రస్తుతం బ్రియాన్ వయసు 47 సంవత్సరాలు. అయినా తాను 18 ఏళ్ల వయసులో ఎలా ఉండేవాడో మళ్లీ ఆ వయస్సులోకి వెళ్లాలని, అలాంటి శరీర ధారుడాన్ని తిరిగి పొందాలని ఆయన తన శరీరంపై ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఈ కోరికను నెరవేర్చుకోవడానికే ఈ ప్రయోగాల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాడు.
ఆలివర్ జోల్మాన్ నేతృత్వంలో ఉన్న డాక్టర్ల బృందం బ్రియాన్ జాన్సన్‌కు వృద్ధాప్య లక్షణాలు రాకుండా చూడటానికి, ఆయన ఎప్పుడూ యువకుడిలా కనిపించేలా చికిత్స చేస్తోంది. ఇప్పటివరకు బ్రియాన్ తన శరీరంపై ఎన్నో ప్రయోగాలు చేశారు. వాటి ఫలితంగా, ఆయన శరీర దారుఢ్యం (కండరాల్లో బలం), ఊపిరితిత్తుల సామర్థ్యం.. 18 ఏళ్ల యువకుడిలా మారిపోయాయి. అంతేకాక, గుండె పనితీరు 37 ఏళ్ల వ్యక్తిలా ఉంది. అలాగే, చర్మం నిగారింపు మాత్రం 28 ఏళ్ల యువకుడిలా ఉందని ఆయన వెల్లడించారు.
అయితే తాజాగా బ్రియాన్ జాన్సన్ మరొక సంచలనాత్మకమైన ప్రయోగానికి పాల్పడ్డారు. తన శరీరంలో ఉన్న రక్తం నుంచి మొత్తం ప్లాస్మాను తొలగించేశారు. ఇది చాలా ప్రమాదకరమైన చర్య. ఎందుకంటే మన రక్తంలో సుమారు 40 శాతం నుంచి 55 శాతం ప్లాస్మానే ఉంటుంది. అయినా కూడా బ్రియాన్ జాన్సన్ ఈ ప్లాస్మాను పూర్తిగా తన శరీరంలో నుంచి తొలగించి, దాని స్థానంలో ఇతర ధ్రవ పదార్థాలను ఇంజెక్షన్ ద్వారా ప్రవేశపెట్టించుకున్నారు.
ప్లాస్మా అంటే ఏంటి?
ప్లాస్మా అనేది తేటగా ఉండే ఎండుగడ్డి రంగులో ఉండే ద్రవం. రక్తంలో ఇది భాగం. రక్తంలో ఉండే ప్లేటిలెట్స్, ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ఇతర సెల్యూలార్ పదార్థాలను ప్లాస్మా ఇతర శరీర భాగాలకు చేరుస్తుంది. రక్తంలో సుమారు 55 శాతం వరకు ప్లాస్మా ఉంటుంది. ప్లాస్మాలో 92 శాతం నీటితో పాటు యాంటీబాడీలు, ముఖ్యమైన ప్రోటీన్ల, లవణాలు, ఎంజైములు ఉంటాయి. ప్లాస్మా శరీరంలో రోగనిరోధక వ్యవస్థకు, రక్త గడ్డకట్టే ప్రక్రియ ఉపయోగపడుతుంది. కొంతమందిలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటం వల్ల వారి ప్లాస్మాలో ఉండే యాంటీబాడీలు వైరస్‌లు, బాక్టీరియాలను ఎదుర్కొంటాయి. రక్తదానం లాగే ప్లాస్మా దానం కూడా సురక్షితమైనది. దానం చేసిన ప్లాస్మా 24 నుంచి 48 గంటల్లో శరీరంలో మళ్లీ తయారవుతుంది. ఆరోగ్యవంతమైన ఒక మనిషి ప్రతి 28 రోజులకు ఒకసారి, ఏడాదిలో 13 సార్లు ప్లాస్మా దానం చేయవచ్చు.
అయితే మానవ శరీరానికి ఇంతటి ముఖ్యమైన ప్లాస్మాని బ్రియాన జాన్సన్ తన శరీరం నుంచి పూర్తిగా తొలగించేశాడు. ఇప్పుడు అందరికీ కలిగే సందేహం ఒక్కటే. ఆయన ఎలా బతికి ఉన్నాడు అని. వైద్యులు.. బ్రియాన్ జాన్సన్ శరీరంలో ప్లాస్మాని తొలగించి దాని స్థానంలో ఆల్బుమిన్, ఐవిఐజి ద్రవాలను ఇంజెక్ట్ చేశారు. ఇది ప్లాస్మాకు బదులు పనిచేస్తోంది. ఆల్బుమిన్ సాధారణంగా ప్లాస్మాలోనే ఉండే పుష్కలమైన ప్రొటీన్. శరీరంలో ఉండే లివర్ దీన్ని తయారు చేస్తుంది. రక్తంలోని డ్రగ్స్, హార్మోన్స్, ఫ్యాటీ యాసిడ్స్.. ఆల్బుమిన్ ద్రవ ప్రొటీన్ ద్వారా శరీరమంతా చేరుతుంది. కిడ్నీ, లివర్ పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో ఆల్బుమిన్ తగ్గితే లివర్ వ్యాధులు, పోషకాహార లోపం, శరీరంలో వాపు సమస్యలు ఉన్నట్లే.
ఇక రెండవది ఐవిఐజి ద్రవం. ఈ ద్రవం యాంటీ బాడీలు తయారు చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఏదైనా బ్యాక్టీరియా, ఇన్‌ఫెక్షన్లు సోకితే రోగనిరోధక శక్తిలోని యాంటీ బాడీలు వాటితో పోరాడి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
Also Read: బ్రెడ్‌ను ఇష్టంగా తింటున్నారా? మీ ఆరోగ్యానికి ప్రమాదం ఉన్నట్లే!
గత సంవత్సరమే బ్రియాన్ జాన్సన్ తన టీనేజర్ కొడుకు శరీరం నుంచి ప్లాస్మా తీసుకొని తన శరీరంలోకి ఎక్కించుకున్నాడు. ఇప్పుడు దాని తొలగించి ఆల్బుమిన్, ద్రవాలు ఇంజెక్ట్ చేసుకున్నాడు. ఈ ప్రయోగం తరువాత తనకు ఏ ఆరోగ్య సమస్య రాలేదని.. తాను బాగా నిద్ర పట్టిందని బ్రియన్ పోస్ట్ చేశాడు.
బ్రియాన్ జాన్సన్ కు గతంలో ఒక పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీ ఉండేది. ఆ కంపెనీని వందల కోట్లకు ఈబే కంపెనీకి విక్రయించేశాడు. ఆ తరువాత నుంచి తాను మళ్లీ యవ్వనంగా ఉండేందుకు ప్రయోగాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రతీ సంవత్సరం తన శరీరంపై చేసే ప్రయోగాల కోసం బ్రియాన్ జాన్సన్ రూ.17 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నాడు.