మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండల కేంద్రంలో హైడ్రా (HYDRAA) మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. సుమారు 300 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించి, అక్కడ తిరిగి ప్రభుత్వ బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ చర్యతో అక్రమార్కుల గుండెల్లో హైడ్రా వణుకు పుట్టించగా, స్థానిక నివాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కబ్జాకు గురైన పార్కు స్థలం..
బాచుపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 142, 143, 144లో ఉన్న 2.30 ఎకరాల ప్రభుత్వ భూమిని 2016లో అప్పటి జిల్లా కలెక్టర్ పార్కు కోసం కేటాయించారు. ఈ స్థలంలో అధికారులు మొక్కలు నాటి, అర్బన్ నర్సరీని అభివృద్ధి చేశారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు వందలాది మొక్కలు నాటడంతో పాటు బోర్‌వెల్, వాటర్ సంప్, వాచ్‌మన్ గది, ఇనుప గేట్లు, ఫెన్సింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయితే, 2023లో కొందరు ప్రైవేటు వ్యక్తులు కన్ను ఈ ఖరీదైన భూమిపై పడింది. రాత్రికి రాత్రే జెసిబిలతో నర్సరీని, మొక్కలను ధ్వంసం చేసి, అది తమ సొంత స్థలమని వాదిస్తూ అక్రమంగా ప్రహరీ గోడను నిర్మించారు.
ప్రజావాణి ఫిర్యాదుతో విచారణ..
ఈ అక్రమ కబ్జాపై స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు, అధికారులు క్షేత్రస్థాయిలో రెవెన్యూ మ్యాపులను పరిశీలించారు. అది ఖచ్చితంగా పార్కు స్థలమేనని నిర్ధారించుకున్న అనంతరం, మంగళవారం భారీ భద్రత నడుమ హైడ్రా బృందం అక్కడకు చేరుకుంది. అక్రమంగా నిర్మించిన గోడలను కూల్చివేసి, తిరిగి ప్రభుత్వ భూమిగా స్వాధీనం చేసుకుంది. వెంటనే ఆ స్థలం చుట్టూ కొత్తగా ఫెన్సింగ్ వేసి, ‘ఇది ప్రభుత్వ భూమి’ అని స్పష్టం చేస్తూ హైడ్రా బోర్డులను పాతింది.
ఎమ్మార్వో కార్యాలయ భూమి కూడా క్లియర్..
అదే సర్వే నంబర్లలో ఎమ్మార్వో కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించిన 30 గుంటల భూమి కూడా కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. పార్కు స్థలంతో పాటు ఈ 30 గుంటల భూమిలోని ఆక్రమణలను కూడా హైడ్రా తొలగించింది. వెరసి సుమారు 3 ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించింది.
హైడ్రాకు స్థానికుల కృతజ్ఞతలు..
కోట్లాది రూపాయల విలువైన పార్కు స్థలాన్ని కాపాడటంతో బాచుపల్లి నివాసితులు సంబరాలు చేసుకున్నారు. కబ్జాదారుల వేధింపుల నుండి విముక్తి లభించిందని, భవిష్యత్తులో తమ పిల్లల కోసం పార్కు అందుబాటులోకి వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, హైడ్రా కమీషనర్‌కు మద్దతుగా స్థానికులు నినాదాలు చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.
ALSO READ: Railway Group-D: రైల్వేలో భారీ కొలువుల జాతర.. 22,000 గ్రూప్-డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల