Phone Tapping Case : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఇన్నాళ్లూ పరారీలో ఉన్న ఐ న్యూస్ ఎండీ శ్రవణ్‌రావు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు మినహాయింపు ఇవ్వడంతో.. ఇండియాకు వచ్చారు. శుక్రవారం రాత్రి 2 గంటల సమయంలో దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. శనివారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ కార్యాలయానికి వచ్చారు. శ్రవణ్‌రావును నోరు విప్పితే ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందుతుల మెడకు ఉచ్చు బిగిసినట్టే.
శ్రవణ్‌రావు ఎందుకు వచ్చారంటే..
ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన మరుసటి రోజే విదేశాలకు పారిపోయారు ఐ న్యూస్ ఓనర్ శ్రవణ్‌రావు. ఆయనకు మాజీ సీఎం కేసీఆర్‌తో బంధుత్వం ఉంది. ఇన్నాళ్లూ అమెరికాలో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. శ్రవణ్‌రావును రప్పించేందుకు పోలీసులు గట్టి ప్రయత్నాలే చేశారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు. ఇంటర్‌పోల్ సాయం కోరారు. పాస్‌పోర్ట్ సీజ్ చేయించే ప్రయత్నం చేశారు. అన్నివైపుల నుంచి పోలీసులు కార్నర్ చేయడంతో.. ఇక తప్పించుకోలేమని భావించిన శ్రవణ్‌రావు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. హైకోర్టు రిజెక్ట్ చేయడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి ఊరట దక్కినా.. విచారణకు రావాల్సిందేనని డెడ్‌లైన్ పెట్టింది సుప్రీంకోర్టు. ఇక తప్పదన్నట్టు సిట్ ముందుకు వచ్చారు శ్రవణ్‌రావు.
శ్రవణ్‌రావును వెంటాడిన సిట్
కేసు విచారణలో భాగంగా గతంలోనే A6 శ్రవణ్‌రావు ఇంట్లో దర్యాప్తు బృందం సోదాలు చేసింది. ఆయనకు చెందిన ఐ న్యూస్ ఆఫీసులోనూ అణువణువూ గాలించింది. కొన్ని హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు సీజ్ చేసింది. అయితే, శ్రవణ్‌రావు మాత్రం విదేశాలకు ఎస్కేప్ కావడంతో.. అతన్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు గట్టిగా చేసింది. ఆయనే తనతంట తానే సిట్ ముందుకు వచ్చేలా చేయడంలో తెలంగాణ పోలీసులు సక్సెస్ అయ్యారు. శ్రవణ్‌రావును సమగ్రంగా ప్రశ్నించేందుకు రెడీ అవుతోంది సిట్.
ఐ న్యూస్‌లో అసలేం జరిగిందంటే..
కేసీఆర్ హయాంలో అనేక మంది ప్రముఖుల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేయించిందనేది అభియోగం. అప్పటి టాస్క్‌ఫోర్స్ చీఫ్ ప్రభాకరరావు ఆ ఆపరేషన్‌ను లీడ్ చేశారు. ఆయన ఇప్పటికీ అమెరికాలో దాక్కున్నారు. వెలమ కమ్యూనిటీకే చెందిన పలువురు పోలీస్ అధికారులు, మరికొందరు లాలూచీపడే ఆఫీసర్లతో స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. రేవంత్‌రెడ్డి ఫోన్ నుంచి.. హైకోర్టు జడ్జీల ఫోన్ల వరకు.. ఎవరినీ వదలకుండా వందలాది మంది ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణ ఉంది. అందుకోసం ప్రత్యేకంగా సర్వర్లు కూడా ఏర్పాటు చేశారు. కొన్ని టాస్క్‌ఫోర్స్ ఆఫీసులో ఉంటే.. మరికొన్ని ఐ న్యూస్ కార్యాలయంలో ఫిక్స్ చేశారు. ఐ న్యూస్ సర్వర్లలో ఫోన్ ట్యాపింగ్‌కు చెందిన కీలక సమాచారం దాచారనే ఆరోపణతో ఛానెల్ ఎండీ శ్రవణ్‌రావును నిందితుడిగా చేర్చింది సిట్. కేసు బయటపడిన మర్నాడే ఆయన పారిపోయారు. ఇన్నాళ్ల తర్వాత తిరిగొచ్చారు.
శ్రవణ్‌రావును ప్రశ్నిస్తే కేసీఆర్ డొంక కదిలేనా..
సిట్ విచారణలో శ్రవణ్‌రావు నోరు విప్పితే.. అప్పటి సీఎం కేసీఆర్ డొంక కదులుతుందని అంటున్నారు. కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెబుతున్నారు. శ్రవణ్‌రావు సైతం ఈ కేసులో కీ పర్సన్‌గా ఉన్నారు. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలో.. ఏయే నెంబర్లపై నిఘా పెట్టాలో.. ఆ లిస్ట్‌ను టాస్క్‌ఫోర్స్ చీఫ్ ప్రభాకర్‌రావుకు శ్రవణ్‌రావునే ఇచ్చేవారని సిట్ ఆరోపణ. శ్రవణ్‌రావుకు ఆ జాబితా ఎవరు ఇచ్చేవారు? కేసీఆరా? కేటీఆరా? హరీశ్‌రావా? అనేదే ఈ కేసులో కీలక పాయింట్. అందుకే సిట్ విచారణకు శ్రవణ్‌రావు హాజరుకావడం రాజకీయంగా ఆసక్తికరం. ఆయన నోరు విప్పితే.. రావుల పేర్లన్నీ బయటకు వస్తాయని అంటున్నారు. శ్రవణ్‌రావు వచ్చాడనే విషయం తెలిసి.. గులాబీ పెద్దల గుండెల్లో ఇప్పటికే గుబులు మొదలైపోయి ఉంటుందేమో. ఇక, ప్రభాకర్‌రావును సైతం ఇండియాకు రప్పిస్తే.. త్వరలోనే ఆ రావులందరి ఖేల్ ఖతం కావడం ఖాయంగా కనిపిస్తోంది.