Donald Trump: అమెరికాలో ట్రంప్ విజయాన్ని అందుకుంటే, తెలంగాణ లోని మారుమూల గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు. అది కూడా ట్రంప్ విగ్రహానికి పూలమాలలు వేసి, జయహో ట్రంప్.. జై జై ట్రంప్ అంటూ నినాదాలు చేశారు. ఇదేందయ్యా ఇది.. ఇది మేమెప్పుడూ చూడలేదే అనుకుంటున్నారా.. అవునండీ బాబు నిజమిది.. ఇంతకు ఎక్కడ జరిగిందో తెలుసా.. తెలంగాణలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీనితో అమెరికాలో సంబరాలు కూడా మిన్నంటాయి. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా శుభాకాంక్షలు తెలుపగా, తెలుగు రాష్ట్రాల సీఎం లు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
అయితే ఇది ఒక చిన్న గ్రామం.. ఈ గ్రామంలో ఏకంగా ట్రంప్ విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఇంతకు ఈ గ్రామంలో ట్రంప్ విగ్రహం వెనుక ఉన్న కథ ఏమిటంటే.. కొన్నె గ్రామానికి చెందిన బుస్సా కృష్ణ కు ట్రంప్ అంటే అమితమైన అభిమానం. ఆ అభిమానం తో తన ఇంటి ఆవరణంలో ట్రంప్ విగ్రహాన్ని 2019లో కృష్ణ ఏర్పాటు చేశారు. ఎప్పుడూ పూజలు కూడా నిర్వహించేవారు. 2020 లో దురదృష్టవశాత్తు కృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ట్రంప్ విగ్రహానికి పూజలు చేస్తూ.. ఆయన కుటుంబ సభ్యులు అదే పరంపర సాగిస్తున్నారు. అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్ గెలవాలని ఈ గ్రామం మొత్తం కోరుకుందట.
తాజాగా ట్రంప్ ఎన్నికల్లో విజయాన్ని అందుకోవడంతో గ్రామస్తులు, కృష్ణ స్నేహితులు గ్రామంలోని ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్స్ కూడా పంచుకున్నారు. ఇదేందయ్యా ఇది అమెరికాలో ట్రంప్ గెలిస్తే, ఇక్కడ సంబరాలు ఏమిటని వారిని అడిగితే.. ఔను మాకు ట్రంప్ అంటే అభిమానం.. అందుకే ఈ సంబరాలని తెలుపుతున్నారట గ్రామస్తులు. ట్రంప్ కు మాత్రం ఈ విషయం తెలిస్తే తెగ సంబరపడి పోతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తం మీద ట్రంప్ గారూ.. మీకు మా రాష్ట్రంలో కూడా ఫ్యాన్స్ ఉన్నారండోయ్…!