Hyderabad flood alert: హైదరాబాద్ నగరాన్ని వరుణుడి వర్షాల దెబ్బ చించేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నగరానికి వర్షం ముప్పుగా మారింది. నగర శివార్లలోని హిమాయత్ సాగర్ జలాశయం ప్రాంతాల్లో వర్షం బాగా కురవడంతో జలాశయం నీటిమట్టం గణనీయంగా పెరిగింది.
హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్ ప్రకటన
ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌లోని ఒక గేటును ఈ రోజు రాత్రి 10 గంటలకు (ఆగస్టు 7, 2025) తెరవనున్నట్లు అధికారులు ప్రకటించారు. కాచ్మెంట్ ఏరియాలో వర్షం ఇంకా కొనసాగుతుండటంతో ముందు జాగ్రత్తగా గేట్‌ను ఎత్తనున్నట్లు తెలిపారు.
అధికారులకు అలర్ట్.. నదీ తీర ప్రాంతాలకు హెచ్చరిక
ఈ విషయాన్ని సంబంధిత శాఖల అధికారులందరికీ ముందుగానే తెలియజేసారు. దిగి వెళ్లే ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ తీరాలకు దగ్గరగా వెళ్లకూడదని హెచ్చరించారు. తక్షణ సహాయం కోసం 040-21111111 లేదా ఎమర్జెన్సీ కోసం 100 నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. నీటి ప్రవాహం పెరిగే అవకాశంతో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఉప్పల్‌లో వరద విరుచుకుపడింది.. ప్రజలు ఇళ్లలో చిక్కుకుపోయారు! న్యూ రాంనగర్ కాలనీ పరిస్థితి దారుణం
ఉప్పల్ చిలుకనగర్‌లోని న్యూ రాంనగర్ కాలనీలో పరిస్థితి భయానకంగా మారింది. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించి ప్రజలు ఇంట్లోనే నలిగిపోతున్నారు. పలుచోట్ల బైకులు వరద నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి.
డ్రైనేజీలు ఉప్పొంగి రోడ్లపైకి నీరు
డ్రైనేజీలన్నీ ఉప్పొంగి రోడ్లపైకి వరదలా వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న కాల్వలు కూడా రోడ్డుగా మారిపోయాయి. కార్లు నీటిలో మునిగిపోయాయి. ట్రాఫిక్ అంతా అస్తవ్యస్తంగా మారింది.
Also Read: Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!
ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్‌లోకి.. సీఎం నుంచి గట్టి ఆదేశాలు! సీఎం రేవంత్ రెడ్డి మానిటరింగ్
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్‌తో పాటు మిగతా ప్రాంతాల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. విద్యుత్ విభాగం అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధంగా ఉంచాలని సూచించారు. రానున్న రెండు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచనలున్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి అదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పారు. నగరంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తీసుకుంటున్నారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మంత్రి పొన్నం ప్రెస్‌మీట్..
హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పరిస్థితిపై స్పందించారు. వచ్చే కొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. అందుకే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. GHMC కమిషనర్, హైదరాబాదు పోలీస్ కమిషనర్, హైడ్రా కమిషనర్, వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ప్రత్యేకంగా GHMC బృందాలను మోహరించాలన్నారు. నీరు నిల్వ లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
సూచనలు పాటించండి
నదీ తీరాల నుంచి దూరంగా ఉండండి
పిల్లలను బయటకి పంపొద్దు
ఎవరైనా సహాయం కావాలంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి
డ్రెయినేజీలు బ్లాక్ అయి ఉంటే మునిసిపల్ అధికారులకు తెలియజేయండి
అత్యవసరంగా 100 లేదా 040-21111111 నంబర్లకు కాల్ చేయండి
వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండడం ఇప్పుడు అత్యవసరం. ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి వీడియోలు తీయడం కాకుండా, సురక్షితంగా ఉండడమే ముఖ్యం. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్ నిర్ణయం వల్ల నగరానికి తక్కువ సమయంలో నీటి ప్రవాహం వచ్చే అవకాశముంది. అందుకే మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని రక్షించుకునేందుకు ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి.