Hyderabad Weather Alert: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచనున్నట్లు చెబుతోంది. ఈసారి నైరుతి రుతుపవనాలు మే 27నే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం కలిగింది. పశ్చిమ మధ్య బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా.. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ఇవాళ నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల..శనివారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్; నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురుస్తాయి. ఇక ఆదివారం ఆదిలాబాద్, కుమురంభీంఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పారు.
హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. సిటీలో అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వీధులు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షం పడింది. భారీవర్షాలు కురుస్తుండటంలోGHMC మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, DRF బృందాలను అప్రమత్తం చేశారు అధికారులు. ముషీరాబాద్ , చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్, నాంపల్లిలో భారీ వర్షం కురిసింది.
మాన్‌సూన్‌పై ముందస్తు చర్యలు చేపట్టడంలో GHMC జాప్యం చేయడంతో.. హైడ్రాకు వర్షాకాలం బాధ్యతలు అప్పగించింది రేవంత్ ప్రభుత్వం. మాన్‌సూన్ సీజన్‌లో రోడ్ల మీద నీళ్లు ఆగకుండా.. డీసిల్టింగ్ పనుల బాధ్యతలను హైడ్రాకు అప్పగించింది ప్రభుత్వం. మాన్‌సూన్ సీజన్‌పై గ్రేటర్ పరిధిలో పూర్తిస్థాయిలో హైడ్రా పనిచేయబోతోందని MAUD సెక్రెటరీ ఇలంబర్తి స్పష్టం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో GHMC వర్షాకాలంపై కార్యాచరణ తీసుకోలేకపోతే ఆ పనులను హైడ్రాకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. అనేక ఏళ్ల నుంచి వర్షాకాలంపై GHMC ప్రత్యేక చర్యలు చేపడుతూ వచ్చింది. GHMC కమిషనర్ కర్ణన్ తీసుకున్న ISUZU వాహనాల టెండర్ల అంశం వివాదాస్పదంగా మారడంతో హైడ్రాకు మాన్‌సూన్ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.
గురువారం రాత్రి రామంతపూర్, అంబర్ పేట్‌లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. సిటీ శివారు ప్రాంతాల్లోకూడా భారీగా వర్షం కురిసింది. అబ్దుల్లాపూర్ మెట్, ఘట్ కేసర్, హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీగా వర్షం కురిసింది. మరోవైపు మేడ్చల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. నాగారం,దమ్మాయిగూడ,ఘాట్ కేసర్,పోచారం మున్సిపాలిటీలో వాన పడింది. కుషాయిగూడ, కాప్రా, ఈసిఐఎల్, మౌలాలి, మల్కాజిగిరి, నేరేడ్ మెంట్, ఆనంద్ బాగ్, చర్లపల్లి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
Also Read: బరువు తక్కువ ఇంధన వినియోగం ఎక్కువ.. ఇంతటి ఘోరానికి కారణం ఇదేనా.!
మరోవైపు సిటీ నడిబొడ్డున కూడా వర్షం దంచికొట్టింది. బంజారాహిల్స్,జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్ పేట్, ఎస్ ఆర్ నగర్, సనత్ నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.
హయత్‌నగర్, ఉప్పల్, కోఠి, తార్నాక, సికింద్రాబాద్ బంజారాహిల్స్, అమీర్‌పేట, సనత్ నగర్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.
రహదారులపై భారీగా వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.