BJP vs Congress: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఇప్ప సారా అంశం మంటలు రాజేసింది. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి తీరుపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్ప సారా అంశంపై చర్చ కొనసాగుతుండగా ఇందిరాగాంధీ పేరును ప్రస్తావించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇదిలాఉండగా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం పైడి రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్ప సారా ఉత్తర తెలంగాణకు ఉపయోగపడే అంశమని వివరించారు. టకీలా అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మంచి పేరు పెట్టారన్నారు.
ఇప్ప సారా పై రాజకీయ వేడి
కల్తీ కల్లు, కల్తీ మద్యం తాగి ఉత్తర తెలంగాణ ప్రజల శరీరాలు శవాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్ప సారా ఆర్గానిక్ విస్కీ అని వ్యాఖ్యానించారు. కల్తీ మద్యం, అల్ఫజోలం కల్లు కంటే ఇప్ప సారా మంచిదన్నారు. దాని పేరును ఇప్ప టకీలా లేదా ఇంకేమైనా పేరు పెట్టాలని.. కానీ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టొద్దని పైడి రాకేశ్ రెడ్డి సూచించారు. ఈ తరుణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కలుగజేసుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్ప సారా అంశం ప్రస్తావన సమయంలో ఇందిరమ్మ పేరును తీసుకురావడంపై మండిపడ్డారు. ఇందిరమ్మ తమ దేవత అని కొనియాడారు.
ఇందిరమ్మ పేరుపై దుమారం
వాజ్ పేయే ఇందిరమ్మను ఉక్కు మహిళ, దుర్గామాతా అన్నారనే విషయాన్ని గుర్తుచేశారు. పైడి రాకేశ్ రెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఇందిరమ్మ పేరు ఉపయోగిస్తారా? అంటూ మండిపడ్డారు. పైడి రాకేష్ రెడ్డి వాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు సైతం కలగజేసుకుని రాకేశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో ప్యానల్ స్పీకర్ బాలు నాయక్ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆదేశించారు.
రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ తుఫాన్
ఇదిలా ఉండగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలుగజేసుకుని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అన్ పార్లమెంటరీ భాష ఎక్కడా వినియోగించలేదన్నారు. ఏలేటి వ్యాఖ్యలపై స్పందించిన పొన్నం ప్రభాకర్.. ఇందిరమ్మను అవమానించడమంటే మహిళా సమాజాన్ని అవమానించినట్లేనని పేర్కొన్నారు. ఆపై మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. మత్తు అనేది పెద్ద చెత్త అని ఆమె పేర్కొన్నారు. ఇందిరమ్మపై బీజేపీకి అక్కసు శోచనీయమని విమర్శించారు.
క్షమాపణల డిమాండ్
సంక్షేమ పథకాలకు గొప్పవారి పేర్లు పెడతారని, అందుకే ఇందిరమ్మ పేర్లు పథకాలకు పెట్టామని ఆమె స్పష్టంచేశారు. రాకేశ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పి.. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీతక్క వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి స్పందించారు. తాను తప్పు మాట్లాడలేదని, అవమానకరంగా మాట్లాడలేదన్నారు. సోషల్ మీడియాలో ఇందిరమ్మపై అసభ్యంగా తప్పుడు ప్రచారం జరుగుతుంటే.. ఒక్క కాంగ్రెస్ నాయకుడు స్పందించలేదని, తానొక్కడినే స్పందించినట్లు గుర్తుచేశారు.
రాకేశ్ రెడ్డి ధీటైన సమాధానం
ఇందిరమ్మ కాంగ్రెస్ కే నాయకురాలు మాత్రమే కాదని, దేశానికి ప్రధానిగా చేశారని పేర్కొన్నారు. ఇప్ప సారా ప్రభుత్వ పరంగా పెడితే ఇందిరమ్మ పేరు పెట్టొద్దని మాత్రమే తాను సూచించానని, అది అవమానించినట్టా? అని ప్రశ్నించారు. ప్రతి దానికి ఇందిరమ్మ పేరు పెడుతున్నారని, అందుకే ఇప్ప టకీలాకు పెట్టొద్దని చెప్పానన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రులయినంత మాత్రాన బెదిరిస్తారా..? చంపేస్తారా..? అంటూ నిలదీశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారికే సిగ్గు లేనప్పుడు తనకెందుకు సిగ్గని ఫైరయ్యారు.
కాంగ్రెస్‌పై రాకేశ్ రెడ్డి ఫైర్
కొత్తవాళ్లు రాజకీయాల్లోకి రావడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కాంగ్రెస్ కు నచ్చడం లేదన్నారు. శాసనసభను వందలసార్లు అగౌరవపరిచిన చరిత్ర కాంగ్రెస్ దేనని పైడి రాకేశ్ రెడ్డి ధ్వజమెత్తారు. పేరు పెట్టడం ఇబ్బంది అయితే రికార్డుల నుంచి తొలగించాలన్నారు. ఇప్ప టకీలాకు ఇందిరమ్మ పేరు పెట్టొద్దని తాము చెప్పామని, కాంగ్రస్ వాళ్లు.. పెట్టుకోవాలనుకుంటే అది వారి ఇష్టమని పేర్కొన్నారు.
Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 90% సబ్సిడీతో స్వయం ఉపాధి పథకాలు.. అప్లై చేసుకోండిలా!