Big Stories

Indravelli Incident: ఇంద్రవెల్లి నెత్తుటి గాథకు 43 ఏళ్లు.. అసలేం జరిగింది..?

Indravelli Incident: ఇంద్రవెల్లి మారణకాండకు నేటికి సరిగ్గా 43 ఏళ్లు. జల్.. జమీన్.. జంగల్ నినాదంతో పోడు భూములకు పట్టాల కోసం సభ ఏర్పాటు చేసుకుంటే.. పోలీసులు తూటాల వర్షం కురిపించి దాదాపు 100 మంది ఆదీవాసి బిడ్డల అమరత్వానికి కారణమైన మారణకాండ జరిగి 43 ఏళ్లయ్యింది. అసలు ఇంద్రవెల్లిలో నాడు ఏం జరిగిందనేది.. నేటి సమాజానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఇంద్రవెల్లిలో ఆనాడు ఏం జరిగింది.

- Advertisement -

అది 1981, ఏప్రిల్ 20. పోడు భూములకు పట్టాలివ్వాలని కోరుతూ ఆదివాసులు ఇంద్రవెల్లిలో సభకు పిలుపునిచ్చారు. తాము ఉత్పత్తి చేసే వస్తువులకు మద్దతు ధర కల్పించాలని రైతు కూలీ సంఘం ఈ సభకు పిలుపునిచ్చింది. ముందుగా ఇంద్రవెల్లిలో సభ ఏర్పాటుకు పోలీసులు అనుమతిచ్చారు. రైతులు, ఆదీవాసులు అధిక సంఖ్యలో వస్తున్నారనే సమాచారంతో పోలీసులు చివరి క్షణంలో ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకున్నారు. చాలా మంది గిరిజనులు అప్పటికే సభా ప్రాంగణం వద్దకు బయలెల్లారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

- Advertisement -

పోలీసులకు, గిరిజనుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభకు అనుమతి లేదని చెప్పారు. ఇదిలా ఉండగా పోలీసులు ఒక్కసారిగా ఆదివాసులపై తూటాల వర్షం కురిపించారు. ఆ తూటాలకు గిరిజన బిడ్డలు నెత్తుటి మడుగుల్లో పడిపోయారు. హక్కులను కాపాడుకునేందుకు సభ ఏర్పాటు చేస్తే.. అప్పటి ప్రభుత్వం వారిపై ఉక్కు పాదం మోపింది. తుపాకుల మోతతో అడవి దద్దరిల్లింది. గిరిజనుల రక్తంతో సభా ప్రాంగణం తడిసిముద్దయ్యింది. పచ్చని అడవి ఎరుపు సింధూరంలా మారింది. గోండు బిడ్డల శవాలు గుట్టలుగా పేరుకుపోయాయి. నాటి నెత్తుటి మరకలు ఇప్పటికీ కొట్టుకుపోలేదు.

Also Read: Merugu Nagarjuna: సొంత ఎమ్మెల్యే సెగ..నాకు వద్దు బాబోయి!

ఇంద్రవెల్లి కాల్పుల ఘటన అప్పట్లో ఒక సంచలనం. నాటి ప్రభుత్వం.. ఈ ఘటనలో కేవలం 13 మంది మాత్రమే చనిపోయారని వెల్లడించింది. ప్రజా సంఘాల నేతలు ఈ సంఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. పీయూడీఆర్ నేతృత్వంలో ఒక నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కాల్పుల ఘటనలో దాదాపు 60 మంది గిరిజన బిడ్డలు అశువులు బాసారని తెలిపింది. వందల మంది త్రీవంగా గాయపడ్డారని పేర్కొంది. ప్రభుత్వ లెక్కలు, నిజనిర్థారణ కమిటీ లెక్కలు వేరుగా ఉన్నా.. అసలు నిజాలు మాత్రం బయటకు రాలేదు. దాదాపు 100 మందిపైగా అమరవీరులయ్యారని గిరిజన బిడ్డలు తెలిపారు.

అమరవీరుల త్యాగాలకు గుర్తుగా రైతు కూలీ సంఘం.. ఇంద్రవెల్లిలో స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇది నచ్చని కొంతమంది గూండాలు.. 1986 మార్చి 19న ఈ స్థూపాన్ని పేల్చేశారు. ప్రజా సంఘాల నేతలు, ఆదీవాసుల పోరాటంతో.. ఐటీడీఏ నిధులో 1987లో తిరిగి స్థూపాన్ని నిర్మించారు. కానీ ఇప్పటికి ఇంద్రవెల్లి అమరులకు ఆంక్షల మధ్యే నివాళులు అర్పిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యి పదేళ్లు కావస్తున్నా కనీసం స్వేచ్ఛగా నివాళులు అర్పించలేక పోతున్నారు. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News