Big Stories

IPL 2024 LSG Vs CSK: చెలరేగిన రాహుల్.. సునాయాసంగా గెలిచిన లక్నో..!

IPL 2024 34th Match LSG Vs CSK: ఐపీఎల్ సీజన్ 2024లో ఊహించని పరాజయం ఒకటి సీఎస్కేకి ఎదురైంది. బ్యాటర్లందరూ వరుసపెట్టి దుమ్ము దులుపుతారంటే, ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టేశారు. క్యాచ్ లు వదిలేశారు. రన్ అవుట్లు చేయలేకపోయారు.  అన్నిటికన్నా ముఖ్యంగా బౌలింగులో తేలిపోయారు. ఈరోజు లక్నోతో జరిగిన మ్యాచ్ లో అన్నింటా ఘోర వైఫల్యంతో చెన్నై పరాజయం మూటగట్టుకుంది.

- Advertisement -

టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ తీసుకోవడంతో మొదట చెన్నయ్ బ్యాటింగ్ చేసింది.  20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనలో లక్నో ఆడుతూ పాడుతూ 2 వికెట్ల నష్టానికి 19 ఓవర్లలో 180 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే… 177 పరుగుల లక్ష్యంతో లక్నో ఓపెనర్లు డికాక్, కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. 134 పరుగుల వరకు వికెట్ పడలేదంటే ఎంత గొప్పగా ఆడారో అర్థమవుతోంది. ఓపెనర్ డికాక్ 43 బాల్స్ ఆడి 1 సిక్సర్, 5 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

Also Read: MS Dhoni Fan Base: ధోనీ వస్తే.. ఆ రీసౌండే వేరబ్బా: డికాక్ భార్య

తర్వాత కేఎల్ రాహుల్ బాధ్యతాయుతంగా ఆడాడు. 53 బంతుల్లో 3 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 82 పరుగులు చేశాడు. సెంచరీ చేసేలాగే కనిపించాడు. కానీ రవీంద్ర జడేజా అద్భుతంగా గాల్లోకి డైవ్ చేసిన పట్టిన క్యాచ్ కి అవుట్ అయ్యాడు. ఇంక అప్పటికి 17 బంతుల్లో 17 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో మ్యాచ్ ఉంది.

మొత్తానికి జడేజా పట్టిన క్యాచ్ పై సందేహాలు కూడా వచ్చి అంపైర్లు రివ్యూకి వెళ్లారు. కానీ తను గాల్లో పట్టుకుని నేల మీదకు ల్యాండ్ అయ్యేటప్పుడు ఏ తప్పు చేయలేదు. దీంతో అవుట్ అని తేల్చారు. తర్వాత నికోలస్ పూరన్ 12 బంతుల్లో 1 సిక్సర్, 3 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మార్కస్ స్టోనిస్ 8 పరుగులు చేసి నాటౌట్ గా  నిలిచి ఇద్దరూ లక్నోని విజయతీరాలకు చేర్చారు.

9వ ఓవర్ లో రవీంద్ర జడేజా బౌలింగులో డికాక్ ఇచ్చిన క్యాచ్ ను చెన్నయ్ ఫీల్డర్ పతిరన నేలపాలు చేశాడు. దీంతో డికాక్ ఆఫ్ సెంచరీ చేసుకున్నాడు. అది పట్టి ఉంటే, మ్యాచ్ మలుపు తిరిగేదేమో అని అందరూ అనుకుంటున్నారు.

Also Read: పాండ్యాకు షాక్.. రూ.12 లక్షల జరిమానా..

చెన్నయ్ బౌలింగులో ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీషా పతిరణ చెరొక వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన చెన్నయ్ కి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రచిన్ రవీంద్ర గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ రహానె (36), రుతురాజ్ గైక్వాడ్ (17), శివమ్ దుబె (3), సమీర్ రిజ్వీ (1), త్వరత్వరగా అయిపోయారు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా నిలబడ్డాడు. 40 బంతుల్లో 1 సిక్సర్, 5 ఫోర్ల సాయంతో 57 పరుగులు చేశాడు.

మొయిన్ ఆలీ (30) తన వంతు రన్స్ చేశాడు. ఇక ఎంఎస్ ధోనీ ఎప్పటిలా చెలరేగాడు. 9 బంతుల్లో 28 పరుగులు చేశాడు. వీటిలో 2 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. మొత్తానికి 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేశారు.

లక్నో బౌలింగులో కృనాల్ పాండ్యా 2, మొహ్సిన్ ఖాన్ 1, యష్ ఠాకూర్ 1, రవి బిష్ణోయ్ 1, మార్కస్ స్టోనిస్ 1 వికెట్ పడగొట్టారు.

ఈ గెలుపుతో పాయింట్ల టేబుల్ లో లక్నో 5వ స్థానంలో ఉండగా, చెన్నయ్ 3 వ స్థానంలో కొనసాగుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News