Big Stories

Merugu Nagarjuna: సొంత ఎమ్మెల్యే సెగ..నాకు వద్దు బాబోయి!

Merugu Nagarjuna news today(Political news telugu): వైసీపీ మార్పులు చేర్పులు వ్యవహారం మంత్రి మేరుగు నాగార్జునకు తలనొప్పిగా మారింది. గుంటూరు జిల్లా వేమూరు నుంచి ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు నాగార్జునను షిఫ్ట్ చేశారు జగన్ సంతనూతలపాడులో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని నాగార్జునకు టికెట్ ఇచ్చారు. దాంతో సదరు ఎమ్మెల్యే మంత్రికి ముఖం చూపించడమే మానేశారు. దానికి తోడు నియోజకవర్గం వైసీపీలో రోజుకొక డ్రామా తెరపైకి వస్తూ నాగార్జునకు తలనొప్పిగా మారుతున్నాయంట. ఆ ఎఫెక్ట్‌తో అనవసంరంగా నియోజకవర్గం మారి వచ్చానని సన్నిహితుల దగ్గర ఆయన వాపోతున్నారంట.

- Advertisement -

ఒక్కపక్క నామినేషన్ల హడావుడి మెదలై అసలు సిసలుఎన్నికల జాతర కనపడుతుంది. అయితే ప్రకాశం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం సంతనూతలపాడు వైసీపీలో మాత్రం అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇన్చార్జ్‌ల మార్పులు చేర్పుల్లో భాగంగా వైసీపీ అధిష్టానం గుంటూరు జిల్లా వేమూరు సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మేరుగు నాగార్జునను సంతనూతలపాడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా పంపి.. ఆయన్నే అభ్యర్ధిగా ప్రకటించింది.

- Advertisement -

సంతనూతలపాడు ఎమ్మెల్యేగా సుధాకర్‌బాబు ఉన్నప్పటికీ.. ఆయన్ని కాదని పక్క జిల్లాకు చెందిన నాగార్జునని పార్టీ ఇన్చార్జిగా ప్రకటించినప్పుడే నియోజకవర్గంలో కొందరు నేతలు ఆయన్న వ్యతిరేకించారు. అయితే పార్టీ పెద్దల బుజ్జగింపులతో పరిస్థితులు సెట్ అవుతున్నట్లు కనిపించాయి. అలా అంతా ఓకే అనుకున్న టైంలో.. ఎన్నికలకు సరిగ్గా నెలరోజులు కూడా లేని తరుణంలో మళ్లీ అసమ్మతి నేతల సమావేశాలు, అలకలు మొదలవ్వడం మంత్రి మేరుగ నాగార్జునకు తలనొప్పిగా మారిందంట.

మేరుగ నాగార్జున సొంత నియోజకవర్గమైన వేమూరు వదిలిపెట్టి సంతనూతలపాడు ఇన్చార్జి గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి స్థానిక నేతలు వర్గాలుగా ఏర్పడి ఆయనకు చుక్కలో చూపిస్తున్నారంట. ఆయనకు సంతనూతలపాడు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించడాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబు తోపాటు నియోజకవర్గంలోని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు వ్యతిరేకించారు. తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పక్క జిల్లాకు చెందిన నేతకు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

నాగార్జునకు కాకుండా స్థానికంగా ఉండే వ్యక్తికి ఇన్చార్జి బాధ్యతలను అప్పగించాలని.. లేకపోతే సహకరించేది లేదని వైసీసీ పెద్దలకు అల్టిమేటం జారీ చేశారు. అయితే జగన్ నిర్ణయంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో స్థానిక నేతలు సైలెంట్ అవ్వక తప్పలేదు. ఆ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న సుధాకర్ బాబు మంత్రి నాగార్జునకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మొదట్లో సంతనూతలపాడు ఇన్చార్జి బాధ్యతలను నాగార్జునకు అప్పగించడంపై బాలినేని సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే తర్వాత బాలినేని మెత్తపడ్డారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశం నిర్వహించిన పార్టీ పెద్దలు.. నేతలకు సర్ది చెప్పడంతో నాగార్జునతో కలిసి పని చేసేందుకు వైసీపీ క్యాడర్ ఒప్పుకుంది. దాంతో పార్టీలో అంతర్గత సమస్య సమసి పోయిందని అందరూ భావించారు. ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వడంతో పార్టీలోని లుకలుకలు మళ్లీ ఫోకస్ అవుతున్నాయి. ఎమ్మెల్యే సుధకార్‌బాబును బుజ్జగించడానికి వైసిపి అధిష్టానం ప్రకాశం జిల్లా పార్టీ డిప్యూటి రిజనల్ కోఆర్టినెటర్ గా పదవి ఇచ్చింది. ఆయన ఆ హోదాలో అన్ని నియోజకవర్గల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నప్పటికీ సంతనూతలపాడు నియోజకవర్గం వైపు మాత్రం చూడటం లేదు.

Also Read: రెబల్స్ సెగ.. సాయి రెడ్డి కథేంటి..?

తనని కాదని మేరుగు నాగార్జనకు టికెట్ ఇవ్వటంతో ఆయన సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోవడం మానేశారు. గత ఎన్నికలలో దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయలేదు. చీమకుర్తి మండలం గ్రానైట్ గనులకు పెట్టింది పేరు.. స్వతహాగా గ్రానైట్ వ్యాపారి అయిన బూచేపల్లికి చీమకుర్తి మండలంలో పలుకుబడి ఉంది. గత ఎన్నికల్లో ఆయన సంతనూతలపాడు సెగ్మెంట్లోసుధకర్ బాబుకి సపోర్ట్‌గా నిలిచి వైసీపీ విజయంలో తన వంతు పాత్ర పోషించారు. ప్రస్తుతం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి వైసీపీ అభ్యర్ధిగా పోటీలో ఉండటంతో సంతనూతలపాడుపై ఫొకస్ పెట్టడం లేదు. అది కూడా నాగార్జునకు మైనస్ అయిందంటున్నారు.

ప్రస్తుతం నియోజకవర్గంలో స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు నాగార్జునకు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతుంది. మంత్రి నాగార్జున తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూఒక వర్గం పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటుంది. మరోవైపు అసమ్మతి నేతలు టీడీపీతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం నాగార్జునకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందంట. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబు బయట పడకపోయినా నియోజకవర్గంలో తెర వెనుక రాజకీయం నడుపుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

నియోజకవర్గంలో నాగార్జునను వ్యతిరేకిస్తున్న ఒక వర్గం నేతలను సుధాకర్ బాబు దగ్గరకు చేర్చుకొని.. మరొక గ్రూపు మెయింటైన్ చేస్తున్నరని.. ప్రస్తుతం వారితోనే మంత్రి నాగార్జునకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో సంతనూతలపాడు వైసీపీ రాజకీయాలు మరల మొదటికి వచ్చాయనే టాక్ నడుస్తోంది. సంతనూతలపాడు నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే తెర వెనుక రాజకీయం చేయడం పట్ల నాగార్జున ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. ఆ క్రమంలో తనపై వస్తున్న విమర్శలపై కేడర్‌కు వివరణ ఇచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను అంచనా వేయకుండా ఈ నియోజకవర్గానికి ఎరక్కపోయి వచ్చి ఇరుక్కపోయానని అంటున్నారట మంత్రి మేరుగ నాగార్జున. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో సంతనూతలపాడు వైసీపీలో నెలకొన్న పరిణామాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. మంత్రి నాగార్జున నియోజకవర్గానికి కొత్త .. అక్కడ ఆయనకు సొంత ఇమేజ్ కాని కేడర్ కాని లేవు. ఆయన అచ్చగా వైసిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్దిపై ఆధారపడుతున్నారు.. మరి చూడాలి జిల్లా మారి వచ్చిన ఆ మంత్రి ప్యూచర్ ఎలా ఉంటుందో.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News