BigTV English

Congress: కరీంనగర్ కాంగ్రెస్‌లో కనిపించని జోరు!

Congress: కరీంనగర్ కాంగ్రెస్‌లో కనిపించని జోరు!

Congress: అధికారం ఉన్నా ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది .. సాక్షాత్తు ఇద్దరూ మంత్రులు ఆ జిల్లా వారే అయినా ఆ నియోజకవర్గం పార్టీ శ్రేణులు మాత్రం ఎవరూ లేని అనాధల్లా తయారయ్యామని వాపోతున్నాయి.. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన కరీంనగర్ సెగ్మెంట్లో ఇలాంటి పరిస్థితి నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ ఎంపీగా, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ గెలిచి చాలా ఏళ్లు అయింది. ఆఖరికి కరీంనగర్ కార్పొరేషన్లో కూడా పట్టు లేకుండా పోయింది. దాంతో స్థానిక సీనియర్ నేతలు పార్టీ దయనీయ స్థితిపై చలించిపోతూ.. బలోపేతానికి తీసుకోవాల్సిన చర్చలపై మీటింగులు పెట్టుకుంటున్నారంట. అసలు కాంగ్రెస్ పెద్దల నుంచి అక్కడి క్యాడర్ ఏం ఆశిస్తోంది?


2004 తర్వాత కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో గెలవని కాంగ్రెస్

అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు తయ్యారు అయ్యిందంట కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి… రాష్ట్రంలో అధికారంలో ఉన్న కరీంనగర్‌లో కనీసం మున్సిపల్ కార్పొరేటర్‌‌ను గెలిపించుకోవడమే కనాకష్టంగా తయారైంది ఆ పార్టీకి … ఎప్పుడో 2004 ఎన్నికల్లో ఎమ్మెస్సార్ గెలిచిన తరువాత కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరనేలేదు… ఉత్తమ్‌కుమార్ రెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నా పార్టీ పునర్నిర్మాణం పై మాత్రం దృష్టి సారించడం లేదని క్యాడర్ వాపోతోంది ..


ముగ్గురు మంత్రులున్నా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి

కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరూ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు‌ ఉన్నారు. వారితో పాటు ఇన్చార్జ్ మంత్రి ఉన్నా కరీంనగర్ సిటీ కాంగ్రెస్ క్యాడర్‌కి సమస్యలు వస్తే ఎవరి దగ్గరికి పోవాలో అంతుపట్టని బేతాళ ప్రశలా మారిందంట. అధికారం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఈ నియోజకవర్గంలో కనీసం మార్కెట్ కమిటీలని కూడా ఇప్పటి వరకు నియమించలేదు. ఎంపీ‌ ఎన్నికల సమయంలో కొద్దిగా జోష్ కనబడినా ఇప్పుడు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి ‌అక్కడే అన్న చందంగా తయ్యారు అయ్యిందంట ‌కాంగ్రెస్ పరిస్థితి. మంచికో చెడుకో ఇద్దరు మంత్రులలో ఒకరి దగ్గరి పోతే మరొకరికి కోపమొస్తుందంట. దాంతో కరీంనగర్ లీడర్ల పరిస్థితి అడ కత్తెరలలో పోక చెక్కలా తయ్యారు అయ్యిందంటున్నారు.

సిరిసిల్ల, కరీంనగర్, హూజురాబాద్, జగిత్యాల, కోరుట్ల

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న పదమూడు స్థానాలలో సిరిసిల్ల, కరీంనగర్, హుజురాబాద్, జగిత్యాల, కోరుట్ల మినహా మిగిలిన ఎనిమిది స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. కరీంనగర్‌కి సమీపంలోని చొప్పదండి, మానకొండూర్‌లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. కాని కరీంనగర్ నియోజకవర్గంలో‌ మాత్రం పార్టీ పుంజుకోలేక పోయిందంటే ఖచ్చితంగా నాయకత్వ లోపమే అని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీ కార్డు నినాదంతో నియోజకవర్గం వాసులకు పెద్దగా పరిచయం లేని పురుమల్ల శ్రీనివాస్‌కు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ నుంచి పోటీ చేసిన ఎంపీ బండి సంజయ్‌లకి శ్రీనివాస్ ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయారు.

నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్‌‌రెడ్డికి సుడా ఛైర్మన్ పదవి

కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకే తప్ప కాంగ్రెస్ అభ్యర్థి కష్టం, కృషితో వచ్చిన ఓట్లేమి కాదు. తరువాత జరిగిన ఎంపీ ఎన్నికలలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో మంచి జోష్ కనిపించినా.. తర్వాత అది కూడా నీరుకారిపోయింది. ఆ క్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ అనాధలా మారిందని, నియోజకవర్గాన్ని పట్టించుకొనే నాథుడే లేకుంండా ‌పోయాడని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. కరీంనగర్ నుండి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డికి మంత్రి శ్రీధర్‌బాబు ఆశీస్సలతో‌ సుడా ఛైర్మన్ పదవి వచ్చింది. తనకి మంత్రి పొన్నం ప్రభాకర్ సహాకరించలేదని పొన్నం కరీంనగర్ వచ్చిన‌ అయనతో కార్యక్రమాలలో పాల్గొనేది లేన్నట్టు నరేందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.

కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా సత్తు మల్లేశం

అలాగే కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా‌ ముఖ్యమంత్రి అనుంగ అనుచరుడు సత్తు మల్లేశం నియమితులయ్యారు. అయితే తాను‌ సూచించిన వారికి పదవులు ఇవ్వలేదని పొన్నం గుర్రుగా ఉన్నారంట. దాంతో వారిద్దరి మధ్య ఇప్పుడు సఖ్యత కరువైందంటున్నారు. అలాగే కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పొటీ చేసిన పురుమల్ల శ్రీనివాస్ కూడా మంత్రి పొన్నంతో కలిసి ఏ కార్యక్రమంలో పాల్గొనడం లేదంట.

పెద్దపల్లి జిల్లాలో చేరిన శ్రీధర్‌బాబు నియోజకవర్గం

జిల్లాల పునర్విభజన తర్వాత మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంధని నియోజకవర్గం పెద్దపల్లి జిల్లాలో చేరింది. పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ ఇప్పుడు సిద్దిపేట జిల్లాగా మారింది. దాంతో మంత్రులు సొంత జిల్లాలకు పరిమితమవుతున్నారని, కరీంనగర్ ‌జిల్లా కేంద్రంపై ఎవరూ ఫోకస్ ‌పెట్టడం లేదంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లా మంత్రిగా కొనసాగిన‌ శ్రీధర్‌బాబు కరీంనగర్‌లో విస్తృతమైన సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆ చనువుతోనే మంత్రి‌ శ్రీధర్ బాబు దగ్గరికి వెళితే శ్రీధర్ బాబు వర్గీయులుగా పొన్నం టీమ్ ముద్ర వేస్తోందంట.

7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పొన్నంకు సొంత క్యాడర్

పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపి‌గా ఉన్నప్పుడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో సొంత క్యాడర్ ఏర్పాటు చేసుకున్నారు. దాంతో ఆయన దగ్గరకు పనుల కోసం వెళ్లేవారిపై పొన్నం అనుచరులన్న ముద్ర పడుతోందంట. ఆ లెక్కలతో జిల్లాలోని ఎమ్మెల్యేలు కూడా ఏ మంత్రి దగ్గరికి పోతే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని తెగ జాగ్రత్తలు తసుకుంటున్నారంట. ఇప్పటికే కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ వరుసగా మూడు సార్లు ఓటమి పాలైంది. ఇక కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 2009 ఎన్నికల నుంచి ఓడిపోతూనే వస్తోంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ కూడా ఆ పార్టీకి అందని ద్రాక్షగానే మారింది.

సైలెంట్ అయిపోయిన మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్

రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయినా కరీంనగర్ ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో మాత్రం గెలవలేకపోయింది. దాంతో కార్పొరేషన్ ఎన్నికలు సమీపంలో ఉండడంతో కనీసం ఈ సారైనా ప్రభావం చూపించగలమా అన్న సందేహం క్యాడర్లో వ్యక్తమవుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ‌అధికారంలో ఉన్న సమయంలో మంచి సంబంధాలు ఉన్న నాయకుడు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్. బీఅర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో కొంతకాలం‌గా ఆయన సైలెంట్‌గా ఉంటున్నారు. ఆ క్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ దిక్కు దివాణం లేకుండా తయారవుతుండటంతో.. ఇటీవల స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారంట.

Also Read: అఘోరీ మెడికల్ టెస్టులో అతి భయంకరమైన విషయాలు.. వీడు మామూలోడు కదా..

నామినేటెడ్ పదవులతో ప్రోత్సహించాలని నిర్ణయం

కరీంనగర్ కాంగ్రెస్ పరిస్థితి మెరుగుప్చడానికి, పార్టీని బలంగా తయారు చేయడానికి ఉన్న అవకాశాలపై సీనియర్లు చర్చించారంట. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా సిటీ కాంగ్రెస్ ఇలా తయారైందేంటని వారు తెగ మధనపడి పోయారంట. మొదటి నుండి కాంగ్రెస్‌ని నమ్ముకున్న వారికి నామినేట్ పదవులు ఇప్పించడమే కాకుండా, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న వారందరినీ.. మేమున్నామని ప్రొత్సహించాలని డిసైడ్ అయ్యారంట.

పార్టీ పెద్దలకు మెుర పెట్టుకుంటున్న కరీంనగర్ క్యాడర్

కరీంనగర్ నియోజకవర్గం దయనీయ స్థితిని ముఖ్యమంత్రి , టీ పీసీసీ అధ్యక్షుల దృష్టికి తీసుకువెళ్ళి బలోపేతంపై చర్చించాలని సీనియర్లు నిర్ణయించుకున్నారంట. అలాగే ‌ఇద్దరూ మంత్రుల మధ్య విభేదాలు తొలగించి సయోధ్య కుదుర్చాలని పార్టీ పెద్దలకు మొర పెట్టుకుంటున్నారంట. మరి కరీంనగర్ సీనియర్ క్యాడర్ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో? పార్టీ పెద్దలు, మంత్రులు వారి ప్రయత్నాలకు ఎంత వరకు సహకరిస్తారో చూడాలి.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×