Big Stories

DK ShivaKumar: డీకే మరో వైఎస్సార్ అవుతారా? కాంగ్రెస్ భయం అదేనా?

DK-SHIVA-KUMAR-YSR

DK ShivaKumar News(Congress News Today): ఆయన బలమైన నాయకుడు. కర్నాటక పీసీసీ అధ్యక్షుడు. ఆయనకంటూ ఓ వర్గం లేదు. కూటమి కట్టిన చరిత్ర లేదు. రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. పార్టీకి కట్టుబడి ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ తర్వాత ఆ స్థాయిలో ట్రబుల్ షూటర్‌గా నిలిచారు. కాంగ్రెస్‌కు కష్టం వచ్చిన ప్రతీసారి.. నేనున్నానంటూ ఆదుకున్నారు. ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు చుట్టుముట్టినా.. వంద రోజులు జైల్లో పెట్టినా.. కాంగ్రెస్ కోసం ప్రాణం పెట్టి పోరాడారు. కర్నాటకలో కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఇవి చాలవా డీకే శివకుమార్‌ను కళ్లుమూసుకుని సీఎంగా ఎంపిక చేసేందుకు? ఆయన పార్టీకి ఎలాంటి సేవలు చేశారో అధిష్టానానికి తెలీదా? మరి, సింపుల్‌గా సాగాల్సిన ముఖ్యమంత్రి ఎంపిక.. ఇంత కాంప్లికేట్ ఎందుకు చేస్తున్నారు? హైకమాండ్ ఏం ఆలోచిస్తోంది? డీకేను కాదని సిద్ధరామయ్య వైపు ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతోంది? ఇవన్నీ ఆసక్తికర విషయాలే.

- Advertisement -

సిద్ధరామయ్యకు ఇవే చివరి ఎన్నికలు. లాస్ట్ ఛాన్స్ అంటూ సీఎం రేసులో నిలిచారు. రిటైర్ అయ్యే నేతకు రాష్ట్రాన్ని అప్పగిస్తే ఏం లాభం? భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మారథాన్ చేయగల లీడర్‌ను కదా ఎంపిక చేయాల్సింది. ఇంత చిన్న లాజిక్ కాంగ్రెస్‌కు తెలియదని అనుకోలేం. ఆ పార్టీ లెక్కలు ఆ పార్టీకి ఉన్నాయి. కాంగ్రెస్‌కు కావలసింది నమ్మశక్యమైన నాయకుడు. పార్టీకి వీరవిధేయుడై ఉండాలి. కూర్చోమంటే కూర్చోవాలి.. నిలుచోమంటే నిలుచోవాలి. ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు రాజీనామా చేయాలి. ఒకవిధంగా దివంగత రోశయ్యలా.

- Advertisement -

డీకే అలా ఉంటారా? అంటే కొంచెం ఉంటారు, కొంచెం ఉండరు. సిద్ధరామయ్య అయితే వంద శాతం అలానే ఉంటారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలిచాక ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. అంత మాత్రానికే డీకే ఇగో హర్ట్ అయింది. తనను వెంటనే సీఎం కేండిడేట్‌గా సెలెక్ట్ చేయలేదని బాగా ఫీల్ అయ్యారు. తానే కాంగ్రెస్‌ను గెలిపించానని, తాను సింగిల్ అంటూ తన మద్దతుదారులతో మంతనాలు జరిపారు. ఢిల్లీకి వెళ్లేది లేదంటూ పరోక్షంగా బ్లాక్ మెయిల్‌కు దిగారు. అదే ఇప్పుడు ఆయనకు మరింత మైనస్ అయింది. అటు, సిద్ధరామయ్య మాత్రం బుద్ధిగా ఉండి.. పార్టీ చెప్పినట్టు చేస్తున్నారు. అదే ఆయనకు ప్లస్ అవుతోంది.

డీకే శివకుమార్ బాగా డబ్బున్న నేత. వేల కోట్ల ఆస్తులు. సమర్థమైన నాయకత్వ లక్షణాలు. అదే ఆయన్ను పీసీసీ చీఫ్‌ను చేశాయి. అతని శక్తిసామర్థ్యాలు చూసి పార్టీకి అధ్యక్షుడినైతే చేశారు కానీ.. సీఎంను ఎందుకు చేయట్లేదనేది ప్రశ్న. రాజకీయం చేయాలంటే డబ్బు ఉండాలి.. అదే డబ్బుకు రాజకీయం కూడా భయపడుతుందని అనడానికి డీకే ఎపిసోడే నిదర్శనం. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన మాట వినకపోతే? ఢిల్లీకి ధీటుగా ఎదిగితే? అనే చిన్న సందేహంతోనే అధిష్టానం వెనకాముందూ ఆలోచిస్తోందా? డీకే.. మరో వైఎస్సార్ అవుతారనే భయమా?

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లోకెల్లా స్ట్రాంగెస్ట్ సీఎంగా ఉండేవారు. సొంతంగా నిర్ణయాలు తీసుకునేవారు. ఆ తర్వాత ఢిల్లీకి చెప్పి ఒప్పించేవారు. పార్టీకి కావలసిన అన్నిరకాల అండాదండా అందించేవారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ను పోషించింది ఆయనే అంటారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నంతకాలం.. పార్టీ అధిష్టానం ఏపీలో వేలు పెట్టలేకపోయింది. వైఎస్ మరణానంతరం.. నెక్ట్స్ ఎవరు? అంటే మరో నాయకుడే లేకుండా పోయింది. జగన్ నేనున్నానన్నా.. పార్టీ ఆయన్ను లైట్ తీసుకుని మరో చారిత్రక తప్పిదం చేసింది. ఇప్పుడు కర్నాటకలోనూ.. డీకే మరో వైఎస్సార్‌లా అవుతారనే భయం హైకమాండ్‌లో ఎంతోకొంత ఉందని అంటున్నారు. అందుకే, డీకే వద్దు.. సిద్ధు ముద్దు.. అంటూ కాలయాపన చేస్తోందని టాక్. అటు, డీకేపై ఉన్న కేసులతో పాటు, కర్నాటక డీజీపీ ప్రవీణ్ సూద్‌ సీబీఐ డైరెక్టర్‌గా నియామకం కావడం కూడా శివకుమార్ సీఎం పదవికి హార్డిల్‌గా మారిందంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News