Big Stories

Jana Reddy : నా కుమారుడికి మంత్రి పదవి అక్కర్లేదు.. నల్గొండ నుంచి పోటీ చేస్తా.. జానారెడ్డి సంచలన నిర్ణయం..

Share this post with your friends

Jana Reddy : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జానారెడ్డి శాలువాతో సత్కరించారు. ఇరువురు నేతలు గంటసేపు వివిధ అంశాలపై చర్చించారు. ఆ తర్వాత మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా జానారెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు.

కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అందరూ సహకరించాలని జానారెడ్డి సూచించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పానన్నారు. హామీలను నెరవేర్చి ప్రజల అభిమానం పొందాలని సూచించానని తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు సమన్వయంతో పనిచేయాలన్నారు. తాను ప్రభుత్వంలో భాగస్వామిని కానని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సూచించానన్నారు.

నల్గొండ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేస్తా అని గతంలో అన్న విషయాన్ని జానారెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తానని మరోసారి స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలో 15 ఏళ్లు మంత్రిగా పనిచేశానని వివరించారు. తన కుమారుడు జైవీర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ ను అడగలేదన్నారు. ప్రస్తుతం జైవీర్ ఎమ్మెల్యేగా ఉన్నారని ఇంకా జూనియర్‌ నాయకుడేనన్నారు. ఇప్పుడే పదవులు అడగలేమని చెప్పారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గాయం కావడం బాధాకరమని జానారెడ్డి అన్నారు. తాను ఆయనను పరామర్శించాని తెలిపారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సూచనలు ఇవ్వాలని కోరారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News