Jangaon District: జనగామ జిల్లా ఉనికిపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ సెగలు రాజుకున్నాయి. జిల్లా తొలగింపు అంశంపై జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి, భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది.
జనగామ జిల్లాను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అనేక పోరాటాలు, బలిదానాలతో సాధించుకున్న జనగామ జిల్లాను క్లోజ్ చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. “జనగామ జిల్లా ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు.. ఒకవేళ జిల్లాను మూసేస్తే, మీ పార్టీ, మీ ప్రభుత్వమే మూతపడటం ఖాయం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కావాలనే ప్రభుత్వం జిల్లాల ప్రక్షాళన పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యే పల్లా వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. జనగామ జిల్లా తొలగింపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కనీసం చర్చ కూడా జరగలేదని స్పష్టం చేశారు. “పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల ప్రక్షాళన చేస్తామని మాత్రమే చెప్పాం తప్ప, జనగామను తీసేస్తామని ఎవరూ అనలేదు. కొంతమంది రాజకీయ నాయకులు కావాలనే ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు” అని విమర్శించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ‘ఇమ్మెచూర్’ (పరిపక్వత లేని) మాటలు మాట్లాడుతున్నారని, ఇతర నాయకులపై ద్వేషంతో అపోహలు సృష్టించవద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.
జిల్లాల ప్రక్షాళనపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ (మంత్రుల కమిటీ)ని లేదా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో కూడిన నిపుణుల కమిటీని నియమించాలని భావిస్తోంది. దీనిపై అధికారిక జీవో త్వరలో వెలువడే అవకాశం ఉంది. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు దూరభారం కాకుండా ఉండటం, వనరుల సమాన పంపిణీని పరిశీలించడం. కొన్ని చిన్న జిల్లాలను కలపడం లేదా సరిహద్దులను మార్చడం వంటి అంశాలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది.