Uttam Kumar Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై కీలక ప్రకటన చేశారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చట్టపరంగా పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు సూచన మేరకు ఆర్టికల్ 32 కింద కాకుండా, ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ ఫైల్ చేయాలని నిర్ణయించుకున్నామని, త్వరలోనే దీనిపై పిటిషన్ వేసి అనుమతులు లేని ప్రాజెక్టులను ఆపాలని కోరుతామని వెల్లడించారు. జల వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న వాదనను తాము గౌరవిస్తామని, అయితే తెలంగాణ హక్కులకు భంగం కలిగితే ఊరుకోబోమని మంత్రి హెచ్చరించారు.
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావలసిన న్యాయమైన వాటాను కాపాడుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఏపీ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి వంటి తెలంగాణ ప్రాజెక్టులకు అనవసరంగా అడ్డుపడుతోందని ఆయన ఆరోపించారు. గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 484 టీఎంసీల కేటాయింపు మాత్రమే ఉందని, అంతకుమించి ఒక్క చుక్క నీటిని వాడుకున్నా అది అంతర్జాతీయ ఒప్పందాలను, కేటాయింపులను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేశారు. వరద జలాల పేరుతో అదనపు నీటిని తరలించే హక్కు ఏపీకి లేదని ఆయన తేల్చి చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక ఉల్లంఘనలు జరుగుతున్నాయని, కేంద్రం ఇచ్చిన ‘స్టాప్ వర్క్ ఆర్డర్’ను కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని మంత్రి విమర్శించారు. ముఖ్యంగా ఎలాంటి చట్టపరమైన అనుమతులు లేకుండా చేపడుతున్న పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని, దీనిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు న్యాయపరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
Read Also: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన