Palakurthi Govt School: విద్యనేర్పే గురువులకు విద్యార్థులపై ప్రేమ ఉంటుంది. కానీ ఓ ఉపాధ్యాయుడికి విద్యార్థులపైనే కాదు.. తాను పనిచేసే పాఠశాలపై కూడా బోలెడంత ప్రేమ ఉంది. అందుకే తాను పనిచేస్తున్న పాఠశాలను కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా అభివృద్ధి చేశాడు. పేరు మోసిన ప్రైవేట్ పాఠశాలలకు మేమేం తక్కువ కాదని నిరూపించాడు.
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ చితిరాల శ్రీనివాస్. ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యను అందించే ఈ ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే 4 లక్షల రూపాయల సొంత ఖర్చులతో కార్పొరేట్ స్థాయికి ధీటుగా స్కూల్ రూపురేఖలు పూర్తిగా మార్చాడు. అంతే కాకుండా స్కూల్‌లోని 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్కొక్క క్లాస్ రూమ్‌కు దేశంలో పేరుగాంచిన మహనీయుల పేర్లను పెట్టారు.
తరగతి గది వెలుపలి గోడలపై సైన్స్‌కు సంబంధించిన అంశాలు, మ్యాథ్స్‌కు సంబంధించిన అంశాలు, ఋతువులను తెలిపేలా గోడలపై అందమైన కళా కృతులతో పెయింటింగ్స్ వేయించారు. అదే గోడలపై విద్యార్థులకు సంబంధించిన దిన చర్యలను అందమైన చిత్రాలతో.. పిల్లలు నేర్చుకునే విధంగా రకరకాల కలర్స్‌తో పెయింటింగ్స్ వేయించారు. విద్యార్థులు ఆడుకునేందుకు వీలుగా గ్రౌండ్ కూడా ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలను నాటి వాటి సంరక్షణ కూడా చూసుకుంటున్నారు. దీంతో చుట్టూ ఉన్న ప్రాంతం కూడా ఎంతో ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా మారిపోయింది.
ఈ స్కూల్ ప్రస్తుతం డిజిటల్ పెయింట్ తో కార్పొరేట్ స్థాయికి మించి ఉండడంతో పాటు తొర్రూరు పాలకుర్తి ప్రధాన రహదారికి అనుకోని ఉండడంతో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. గత సంవత్సరం 36 మంది విద్యార్థులతో ఉన్న ఈ పాఠశాలలో.. ఈసారి 100 మందికి పైగా అడ్మిషన్ తీసుకున్నారు. దీంతో ఈ ప్రైమరీ స్కూల్ విద్యార్థులతో నేడు కల కలలాడుతోంది.
తాను పని చేస్తున్న పాఠశాలలోని పిల్లలే తన పిల్లలుగా, పాఠశాలను తన ఇల్లుగా భావిస్తూ తన కంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు శ్రీనివాస్. ప్రభుత్వం చేపట్టిన బడి బాట కార్యక్రమం ద్వారా తమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు. గ్రామస్తులు సహకరిస్తే స్కూల్‌ను మరింత డెవలప్ చేస్తానని చెబుతున్నారు.
Also Read: అన్నా, చెల్లి తేల్చుకోవడానికి రెడీ.. కేసీఆర్ లెక్కలేంటీ?
గతంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిన స్కూల్ ని ఎర్రమట్టి బొందల స్కూల్‌గా పిలిచేవారని స్థానికులు చెబుతున్నారు. అంతే కాకుండా పాఠశాలలో పిల్లలను చదివించడానికి కూడా ఆసక్తి చూపించే వారు కాదని అంటున్నారు. సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో విద్యార్థులను ప్రయివేట్ స్కూల్స్‌కు పంపించే వారు. దీంతో స్థానికంగా ఉన్న నాలుగు ప్రైవేట్ పాఠశాలల పోటీని తట్టుకోలేక, విద్యార్థులు రాక స్కూల్ మూసివేసే పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలోనే హెడ్ మాస్టర్ శ్రీనివాస్ పాఠశాలను కార్పొరేట్ స్థాయికి దీటుగా మార్చారని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ప్రధాన ఉపాధ్యాయుడికి కృతజ్క్షతలు చెబుతున్నారు.