BRS leader Jitta Balakrishna Reddy passes away: బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విషాదం నెలకొంది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయనను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఇటీవల బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్ సోకిందని, రోజురోజుకు అనారోగ్యం తీవ్రంగా వ్యాపించడంతో పరిస్థితి విషమంగా మారిందన్నారు. ఇందులో భాగంగానే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన భౌతికకాయన్ని కుటుంబ సభ్యులు భువనగిరి తీసుకెళ్లారు.
భువనగిరిలోని మగ్గంపల్లి రోడ్డులో ఉన్న ఫామ్ హౌస్‌లో సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు సంతాపాన్ని ప్రకటించారు.
కాగా, తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించాడు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జిట్టా పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిక్కెట్ దక్కకపోవడంతో పార్ట నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అలాగే 2014, 2018 ఎన్నికల్లోనూ పోటీ చేసిన ఆయన ఓటమి చెందారు.
అంతకుముందు, 2009లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కానీ అదే ఏడాది వైఎస్సార్ చనిపోడంతో కాంగ్రెస్ నుంచి కూడ బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఈ సమయంలో వైఎస్ జగన్ తెలంగాణ వ్యతిరేక విధానాన్ని తీసుకోవడంతో ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించాడు.
అనంతరం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన.. నెల రోజులు కూడా గడువక ముందే 2023లో బీఆర్ఎస్ లో చేరారు. దీంతో 2009లో పార్టీని వీడిన ఆయన.. 14 ఏళ్ల తర్వాత మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు.
Also Read: ఎర్రవల్లి ఫామ్‌హౌస్.. శుక్రవారం తెల్లవారుజామున.. కేసీఆర్ మహాయాగం..
ఇదిలా ఉండగా, జిట్టా బాలకృష్ణారెడ్డి 1972 డిసెంబర్ 14న యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన జిట్టా బాలరెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించారు. 1987లో బీబీనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి సెకండరీ స్కూల్ పూర్తి చేశాడు. ఆ తర్వాత 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియన్ పూర్తిచేశారు. 1993లో డీవీఎం డిగ్రీ అండ్ పీజీ కళాశాల నుంచి బీకామ్‌లో గ్రాడ్యుయేషన్‌లో పూర్తి చేశారు.
అలాగే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారు. పార్టీకి అన్ిన తానై వ్యవహరించారు. తెలంగాణ పదాన్ని ప్రజల్లో తీసుకొచ్చిన ఆయన.. అప్పట్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో కాళ్లు, చేతులు వంకర్లు తిరిగి ఇబ్బంది పడుతున్న ఎంతోమందిని చూసి చలించిపోయారు. దీంతో సొంత ఖర్చులతో చాలా గ్రామాల్లో ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు నెలకొల్పారు.