By Poll Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్ధి ఎంపిక విషయంలో బీజేపీ వ్యూహం ఏంటి?. మహిళా అభ్యర్ధిని రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నారా? లేక పాత ముఖ చిత్రాన్నే మళ్ళీ తెర మీదకు తెస్తారా?..అనేది పార్టీలో చర్చనీయంశంగా మారింది. ఉప ఎన్నికల్లో సత్తా చాటుకొని రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపినే అన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా పంపాలన్న పట్టుదలతో కమలదళం ఉందంట? ఈసారి బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుని ఏలాగైనా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది?.. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ గెలవాలన్న స్కెచ్ వర్కౌట్ అవుతుందా?
అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నిక ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కీలకం కానుంది. గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని…వచ్చే ఉప ఎన్నికలో గెలుపు కోసం పక్కా స్కెచ్ లు వేస్తున్నాయి. పదేళ్ల కేసీఆర్ పాలనకు స్వస్థి పలికి తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రజా పాలన వచ్చి ఏడాదిన్నర తర్వాత జరిగే ఉప ఎన్నిక ఇది. మరి ముఖ్యంగా ప్రజా పాలనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి జుబ్లీ హిల్స్ బైపోల్ మరింత కీలకం కానుంది. సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఖాతా కూడా లేదు. తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలుచుకుని షాక్ ఇచ్చింది. ఇప్పుడు కచ్చితంగా జూబ్లీహిల్స్ సీటు గెలిచి హైదరాబాద్‌పై పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈ ఎన్నికలో గెలుపు రాబోయే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలకు బూస్టప్‌గా నిలుస్తాయన్న అంచనాల్లో అన్ని పార్టీలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ముందు జరిగే ఈ ఉప ఎన్నిక దిశ దశలను మార్చే ఎన్నికగా భావిస్తూ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ కూడా సర్వశక్తులు ఒడ్డుతోంది.
జూబ్లీహిల్స్‌పై పట్టు బిగించాలని చూస్తున్న బీజేపీ
అయితే ఈ సారి జూబ్లీహిల్స్ స్థానంపై పట్టుబిగించాలని బీజేపీ ప్లాన్ చేస్తుందట. ఇటీవల రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించి మంచి జోష్ మీదున్న బీజేపీ అదే జోష్‌లో జూబ్లిహిల్స్ పై కాషాయ జెండా ఎగరవేయాలనే సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తోందట. అందులో భాగంగానే కాషాయ నేతలు జూబ్లిహిల్స్ స్థానంపై గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారట. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. సికింద్రాబాద్ ఎంపీగా కొనసాగుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి.. ఈ ఉప ఎన్నిక సవాల్ గా మారనుంది.
డిపాజిట్ దక్కించుకోలేక పోయిన లంకాల దీపక్‌రెడ్డి
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాషాయ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. ఈ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డికి కేవలం 19 వేల ఓట్లే పోలయ్యాయి. గత ఎన్నికల్లో ఏ మాత్రం పోటీ ఇవ్వలేక , డిపాజిట్ తెచ్చుకోలేక పోయింది. అందుకు భిన్నంగా ఈ సారి ఉప ఎన్నికలో మహిళకు అవకాశం ఇవ్వాలనే యోచనలో బీజేపీ నాయకత్వం వున్నట్టు టాక్ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికపై బీజేపీ మానిటరింగ్ కమిటీ వేసింది. ఈ కమిటీలో రఘునందన్ రావు, పాయల్ శంకర్, గరికపాటి రామ్మోహన్ రావు, చింతల రామచందరారెడ్డి, గౌతం రావులు ఉన్నారు.
కిషన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన దీపక్‌రెడ్డి
అయితే పార్టీలో టికెట్ ఎవరికి అనే దానిపై కమలంలో ఓవైపు చర్చ.. మరోవైపు రచ్చ రేపుతోందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డికి పార్టీ అవకాశం ఇచ్చింది. కానీ ఫలితం రాబట్టలేకపోయింది. కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుండటం వల్లే దీపక్ రెడ్డికి గత ఎన్నికల్లో అవకాశం వచ్చిందనే టాక్ ఉంది. గత ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన దీపక్ రెడ్డిపై ఈ ఉప ఎన్నికల్లో సానుభూతి కలిసొస్తుందనే చర్చ దీపక్ వర్గీయుల్లో ఉందట. కానీ అందుకు భిన్నంగా ఈ సారి అధిష్టాన పెద్దలు మాత్రం దీపక్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చి, ఆ తప్పు, ఆ సాహసం చేయరనీ, ఆ పరాజయాన్ని మళ్ళీ చవిచూడడానికి సిద్దంగా లేరంటున్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యకవర్గంలో మహిళలకు తగ్గిన ప్రాతినిధ్యం
అధిష్టాన లెక్కల ప్రకారం దీపక్ రెడ్డిని పక్కన పెట్టి, ఈ సారి జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉదంటున్నారు. అంతేకాదు బీజేపీ నూతన అధ్యక్షుడు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గం ఎన్నిక తర్వాత బీజేపీలో మహిళా ప్రాతినిథ్యం పూర్తిగా తగ్గిందనే విమర్శలు సైతం ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 21 మంది ఉన్నారు. వీరిలో డీకే అరుణ మినహాయిస్తే, మహిళా ప్రాతినిథ్యమే లేదు. ఆ లెక్కలతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మహిళలకు అవకాశం ఇచ్చేందుకు నాయకత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
కిషన్‌రెడ్డి పట్టుబట్టి దీపక్‌రెడ్డికి టికెట్ ఇప్పించుకుంటారా?
మహిళా శక్తితోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తొలి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపేననే భవిష్యత్ సంకేతాలు ప్రజల్లోకి పంపించాలనే ఉద్దేశంతో పార్టీ పెద్దలున్నట్టు సమాచారం. ఒకవేళ కిషన్‌రెడ్డి పట్టుబట్టి దీపక్ రెడ్డికే టికెట్ ఇప్పించుకుంటే కచ్చితంగా ఆది బీఆర్ఎస్ కు ఉపయోగపడే అవకాశముందనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ ముఖ్య నేతలు సైతం అదే ఫీల్ అవుతున్నారంట. గతంలో కూడా ఒక డమ్మీ అభ్యర్థిని బరిలో దించి బీఆర్ఎస్ కు సహకరించారనే అపవాదు బీజేపీపై ఉంది.
మహిళా రేసులో ముందు కనిపిస్తున్న జూటూరి కీర్తిరెడ్డి
జూబ్లిహిల్స్ టికెట్‌పై చాలామంది కమల నాథులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే మహిళా అభ్యర్ధితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో దిగితే కచ్చితంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఎదురుకోవచ్చనే అంచనాల్లో బీజేపీ నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజెపీ అధిష్టాన పెద్దల ఆశీస్సులు ఎవరికి దక్కుతాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహిళ ప్రాతినిథ్యం కోణంలో పార్టీ ఆలోచిస్తే గనక ఈ స్థానం నుంచి జూటూరి కీర్తి రెడ్డి ముందు వరసలో ఉన్నారనే టాక్ నడస్తోంది. వీరపనేని పద్మ కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా జూటూరీ కీర్తి రెడ్డి టికెట్ కోసం చాలానే ప్రయత్నాలు చేశారు. ఈ సారి బైపోల్‌లో పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: కేరళలో కొత్త వైరస్.. 100 మందికి పైగా..?
మొత్తానికి జూబ్లీ హిల్స్ అభ్యర్ధి ఎంపిక విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది . అయితే ఇప్పటివరకు బీజేపీ నేతల అంచనాలు, ఆలోచనలు గొప్పగా ఉన్నప్పటికీ ఎన్నిక సమయానికి ఎలాంటి వ్యూహాలతో అడుగులు వేస్తారనే చూడాలి మరి.
Story By Rami Reddy, Bigtv