Jubilee hills Byelection: రాజకీయాల్లో జాగ్రత్తగా అడుగులు వేయాలి. తేడా వచ్చిందంటే ఇమేజ్ డ్యామేజ్ కావడం ఖాయం. తెలంగాణ రాజకీయాల గురించి చెప్పనక్కర్లేదు. అధికార పార్టీని ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్-బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్‌పై ఆ రెండు పార్టీలు ఫోకస్ చేశాయి. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
జూబ్లీహిల్స్ అభ్యర్థిగా తాను రేసులో ఉంటానని చెప్పిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది తెలంగాణ కాంగ్రెస్. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఈ సీటును దక్కించుకోవాలని కాంగ్రెస్-బీఆర్ఎస్-బీజేపీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ బీసీలకు చెందిన లోకల్ వ్యక్తికి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక రానుంది. అక్కడ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అక్కడ గెలుపొందాలంటే మైనార్టీ ఓట్లు చాలా కీలకం. గతంలో ఈ నియోజకవర్గం నుంచి అజారుద్ధీన్ పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని పట్టుబట్టారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పెద్దలతో అజారుద్దీన్ సమావేశమయ్యారు.
కాంగ్రెస్ తరపున అజారుద్దీన్ బరిలో ఉంటే బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటై ఆయనను ఓడించాలని ప్లాన్ చేసినట్టు ఓ ఫీలర్ బయటకు వచ్చింది. దీన్ని పసిగట్టిన తెలంగాణ కాంగ్రెస్, అజార్‌కు ఎమ్మెల్సీ సీటు కేటాయించింది. ఒక్కసారి వెనక్కి వెళ్దాం.. గవర్నర్ కోటా కింద ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయడంపై సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
ALSO READ: అసెంబ్లీ కీలక ఘట్టం.. కాళేశ్వర ప్రాజెక్టుపై కీలక చర్చ
అదే సమయంలో మళ్లీ వారినే ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తారనే చర్చ తెలంగాణలో జోరుగా సాగింది. సీఎం రేవంత్ తనదైనశైలిలో ప్లాన్ చేసి కోదండరామ్, అజారుద్దీన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై హైకమాండ్‌ను తెలంగాణ నేతలు ఒప్పించడం, కేబినెట్‌లో గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయింది.
రేపోమాపో అజార్‌కు రేవంత్ మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయమని అంటున్నారు. రేవంత్ మంత్రి వర్గంలో ఇప్పటివరకు ముస్లిం వర్గానికి చెందినవారు లేరు. జిల్లాల సమీకరణాలు, గ్రేటర్ హైదరాబాద్ కు ఒక్కరూ ప్రాతినిధ్యం లేదు. ఈ లెక్కన అజారుద్దీన్ సరిపోతారని భావించి ఆయన్ని ఎమ్మెల్సీగా ఎంపిక చేసిందని అంటున్నారు.
కౌన్సిల్‌కు అజారుద్దీన్ పంపించడం ద్వారా ఇటు మైనార్టీలకు, అటు హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం పెరగడమే కాకుండా జూబ్లీహిల్స్ సీటుని దక్కించుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. ఈ లెక్కన రాబోయే రోజుల్లో ప్రధాన మూడు పార్టీల మధ్య రాజకీయ యుద్ధం మొదలవ్వడం ఖాయమని చెబుతున్నారు విశ్లేషకులు.