TPCC Notice: స్వేచ్చ బ్యూరో: జుక్కల్ ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. అంతర్గత వివాదాలను రచ్చకెక్కించడంపై టీపీసీసీ ఫైర్ అయింది. జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యుడు తోట లక్ష్మీకాంతరావు వ్యవహరించిన తీరుపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నాయకత్వం తీవ్రంగా పరిగణించినట్లు విశ్వసనీయ సమాచారం.సమస్యలపై పార్టీ అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను మీడియా లోరచ్చ చేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా పార్టీ సీనియర్ నేతలు తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
పైగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం, ఢిల్లీ స్థాయిలో పేరున్న సీనియర్ మంత్రి దామోదరపై ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఆరోపణలు గుప్పించడంపై గాంధీ భవన్ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. జుక్కల్ ఎమ్మెల్యే తీరుపై క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా గాంధీభవన్ ముందు రెండు సార్లు ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలోనే పార్టీ సీరియస్ గా పరిగణలోకి తీసుకున్నది. సరైన ప్రాథమిక ఆధారాలు (ప్రూఫ్స్) లేకుండానే, నేరుగా మీడియా ముందుకు వచ్చి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దిగజార్చేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే అంశంపై త్వరలో జుక్కల్ ఎమ్మెల్యేకు టీపీసీసీ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.
సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవితో పాటు నియోజకవర్గాల్లో పార్టీ పదవుల ఎంపిక, అలాగే ఇతర స్థానిక అంశాలపై కామారెడ్డి జిల్లాకు చెందిన జుక్కల్ ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటున్నారనే ఫిర్యాదు మంత్రి దామోదరకు అందింది. దీంతో ఢిల్లీ లో మంత్రి దామోదర..జుక్కల్ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. బహిరంగంగా ప్రశ్నించడంతో జీర్ణించుకోలేక జుక్కల్ ఎమ్మెల్యే ..మంత్రి పై సోషల్ మీడియా, ఇతర మాద్యమాల్లో తప్పుపడుతూ కామెంట్లుచేశారు. అభిప్రాయభేదాలు ఉన్నట్లయితే, వాటిని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నప్పటికీ, బహిరంగంగా వ్యాఖ్యానించడంపై పార్టీ సీరియస్ గా తీసుకున్నది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న సీనియర్ నేతపై విమర్శలు గుప్పించడం క్రమశిక్షణా రాహిత్యమేనని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు. అంతేగాక అధికారంలో ఉన్న సమయంలో సొంత పార్టీ నేతలపైనే బహిరంగ వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధాన్ని అందించినట్లైందని అధిష్టానం మండిపడుతోంది.
Also read: పవన్ అన్నా బాటలోనే మరో టాలీవుడ్ స్టార్ కపుల్స్? డివోర్స్ ఫార్మాలిటీస్ పూర్తి?
ఈ నేపథ్యంలోనే జుక్కల్ ఎమ్మెల్యే తీరుపై టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ సీరియస్ యాక్షన్ తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు గాను ఆయనకు త్వరలోనే షోకాజ్ నోటీసు జారీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. బహిరంగంగా మాట్లాడిన వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాలని, ఆరోపణలకు తగిన ఆధారాలు ఉంటే సమర్పించాలని, లేకపోతే క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ కోరనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ వివాదంపై దృష్టి సారించి, అంతర్గతంగా క్రమశిక్షణను తుచ తప్పకుండా పాటించాలని ఆదేశించారు. సొంత పార్టీకి చెందిన సీనియర్ మంత్రులపై ఆధారాలు లేకుండా మీడియా ముందట ఆరోపణలు చేయడం క్రమశిక్షణా రాహిత్యం కిందకే వస్తుందని, ఇలాంటి ధోరణిని ఉపేక్షిస్తే ఇతర నేతలకు కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధిష్టానం స్పష్టం చేస్తోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో టీపీసీసీ నుండి ఈ విషయమై అధికారిక నోటీసులు జారీ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Also Read: గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేయకపోతే మీ పాస్వర్డ్స్, పర్సనల్ డేటా గోవిందా!