
Telangana Highcourt new CJ(Latest news in telangana): తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పొనుగోటి నవీన్‌రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన ఒక్కరోజే ఈ పదవిలో ఉంటారు. కేంద్ర న్యాయశాఖ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దీంతో హైకోర్టు సీజే బాధ్యతలను తాత్కాలికంగా సీనియర్ జడ్జి జస్టిస్ నవీన్ రావుకు అప్పగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 223 ప్రకారం రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారని ఉత్తర్వుల్లో కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. అయితే జస్టిస్ నవీన్‌రావు శుక్రవారమే పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన ఒక్కరోజే సీజే బాధ్యతలను నిర్వహిస్తారు.
జస్టిస్ నవీన్‌రావు 1986లో న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ హైకోర్టులో 2013 ఏప్రిల్ 12న అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2014 సెప్టెంబర్ 8న శాశ్వత న్యాయమూర్తి హోదా నవీన్ రావుకు దక్కింది. రావి- బియాస్ నదీజలాల ట్రైబ్యునల్ సభ్యుడిగా ఆయన 2022 ఏప్రిల్ 22న నియమితులయ్యారు.
శనివారం నుంచి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తారని కేంద్ర న్యాయశాఖ స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే పేరును సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించింది. ఈ నెల 5న కేంద్ర ప్రభుత్వానికి ఆయన పేరును సిఫార్సు చేసింది. ఈ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపాలి.
కొత్త ప్రధాన న్యాయమూర్తి పదవీ ప్రమాణం చేసే వరకు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా బాధ్యతలు నిర్వహిస్తారు. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి 1989 ఆగస్టు 31న న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు. ఆయన 2017 సెప్టెంబర్ 21న ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.