Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన విచారణ కమిషన్ నివేదిక సీఎం రేవంత్ రెడ్డికి అందింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో నివేదికను సీఎం సమక్షంలో సమర్పించారు. నివేదికలో కీలక విషయాలు ఒక్కొటిగా బయటపడుతున్నాయి. హై లెవల్ కమిటీ అనుమతి లేకుండా బడ్జెట్ విడుదల చేసిన విషయాన్ని కమిషన్ లో వివరంగా ప్రస్తావించింది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో నాటి ప్రభుత్వ పెద్దలు నేరుగా సంప్రదింపులు జరిపి, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడం సమస్యగా వెల్లడైంది. అధికారుల వైఖరిపై లీగల్ అంశాలతో ప్రభుత్వానికి సిఫార్సులు చేశారంటూ నివేదిక పేర్కొంది.
ఈ నివేదికను సమగ్రంగా అధ్యయనం చేసి పూర్తి నివేదిక రూపొందించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నీటిపారుదల, న్యాయ మరియు సాధారణ పరిపాలన శాఖల సెక్రటరీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ నెల 4న జరగనున్న కేబినెట్ సమావేశానికి ముందు ఈ కమిటీ నివేదికను సమర్పించనుంది. కేబినెట్ మీటింగ్ మినిట్స్‌ను కూడా పరిశీలించిన కమిషన్, డిజైన్ లోపాలు, నిర్మాణ లోపాలు, ఆర్థిక గందరగోళాలపై పూర్తి స్థాయిలో వివరాలు ఇచ్చింది. పైగా ఐఏఎస్‌లు మరియు ఇంజినీర్ల మధ్య సమన్వయం లేదని స్పష్టంగా నిర్ధారించింది.
ఈ నేపథ్యాన్ని బట్టి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ దోషి అని కమిషన్ తేల్చిందని ఆయన అన్నారు. లక్షల కోట్ల రూపాయలు వృధా చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలయ్యేలా చేశాడని గౌడ్ ఆరోపించారు. ఇంజినీర్లు సూచించిన విషయాలను పట్టించుకోకుండా తనకిష్టమైన ప్రదేశాల్లో ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆర్ ఆదేశించాడని అన్నారు. నిర్మాణ సమయంలో పిల్లర్స్ కుంగిపోవడాన్ని సామాన్య విషయం కాదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం లోపాలతో నిండిపోయిందని, దీని వెనుక కేసీఆర్ వ్యక్తిగత లాభం మాత్రమే ఉందని విమర్శించారు.
కేటీఆర్ పాత్రపై కూడా గౌడ్ ప్రశ్నలు లేపారు. ఈ కార్ రేసులో ఆయనకు అవినీతి సంబంధాలు లేవా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినవారు తప్పించుకోలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ, పార్టీలో గ్రూపులు సహజమని, కానీ ఎన్నికల సమయంలో అందరూ ఒక్కటిగా పని చేస్తారని చెప్పారు. పాతవాళ్లతో పాటు కొత్తవాళ్లు కూడా పార్టీలో ఉండటం మంచిదని, ఇవే కాంగ్రెస్ పార్టీకి బలం అని తెలిపారు. కేసీఆర్ కుటుంబాన్ని “అబద్ధాల పుట్ట”గా అభివర్ణించారు. తమ వాణిజ్య స్వార్ధం కోసం రాష్ట్ర ప్రజల నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టు వంటి అవసరాలు తాము మేల్కొని చేసిన ఫిర్యాదుల వలనే ఆగాయన్నారు. తమ ప్రభుత్వంలో పారదర్శకత, ప్రజా ప్రయోజనం ముఖ్యమని స్పష్టంగా వెల్లడించారు.