KAVITHA: హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ వద్ద బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సింగరేణి కార్మికుల న్యాయమైన సమస్యలను తక్షణం పరిష్కరించాలనే ప్రధాన డిమాండ్‌తో భారత జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆందోళనకు దిగారు. హెచ్‌ఎంఎస్ (HMS) సింగరేణి యూనియన్ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలతో కలిసి ఆమె సింగరేణి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల చర్యను నిరసిస్తూ కవిత సింగరేణి భవన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు కవితతో పాటు పలువురు ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత ప్రభుత్వంపై సింగరేణి యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. కొత్త బొగ్గు బ్లాకులను ప్రైవేట్ సంస్థలకు కాకుండా, కేవలం సింగరేణి సంస్థకే కేటాయించాలని.. అప్పుడే సంస్థకు ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని స్పష్టం చేశారు. లాభాల్లో ఉన్న సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలను సహించేది లేదని ఆమె హెచ్చరించారు. అలాగే, కష్టపడి పనిచేసే సింగరేణి కార్మికుల జీతాల నుండి ఆదాయపు పన్ను (Income Tax) వసూలు చేయడాన్ని తక్షణం ఆపాలని, తద్వారా కార్మికులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలని కోరారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. సింగరేణి పరిధిలో జరుగుతున్న ప్రతి కాంట్రాక్ట్‌లోనూ భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ‘ప్రతి కాంట్రాక్టులో 25 శాతం అవినీతి జరుగుతోంది. అందులో 10 శాతం వాటా నేరుగా కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి వెళ్తోంది’ అని కవిత తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంగా వాడుకుంటోందని మండిపడ్డారు. ఈ అవినీతిపై ప్రభుత్వం స్పందించకపోతే.. తాము కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి ఫిర్యాదు చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్మికుల కష్టార్జితాన్ని దోచుకుంటున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా సింగరేణి కార్మికుల కోసం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని తాము పోరాడుతున్నామని కవిత గుర్తు చేశారు. గనుల్లో పనిచేసే కార్మికుల ఆరోగ్యానికి ఇది ఎంతో కీలకమని.. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, కొత్త ఉద్యోగాల కల్పన దేవుడెరుగు.. ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలను (వారసత్వ ఉద్యోగాలు) కూడా తొలగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారిని రోడ్డున పడేయడం అన్యాయమని అన్నారు. సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం తమ పోరాటం ఆగదని.. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.