Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు.. మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు గురించి ఆమె చేసిన ఆరోపణలు, అలాగే తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై వెల్లడించిన అంశాలు చర్చనీయాంశమయ్యాయి.
హరీష్ రావుపై ఆరోపణలు
శనివారం మీడియాతో మాట్లాడిన కవిత, హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారీ అవినీతి చోటుచేసుకుందని ఆమె నేరుగా ఆరోపించారు. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయాన్ని ప్రస్తావిస్తూ.. 2016లోనే నేను కేటీఆర్‌ను ఈ విషయంలో అలర్ట్ చేశాను, అని గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాను అప్పుడే సమస్యలను చూపించినా, నిర్ణయాలు మాత్రం పూర్తిగా కేసీఆర్ పరిధిలోనే జరిగాయని అన్నారు. ప్రతి నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్‌కు చెప్పారనే విషయాన్ని కూడా గుర్తుచేశారు.
హరీష్ రావుపై వ్యక్తిగతంగా తనకు ఎలాంటి విభేదాలు లేవని. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తప్ప మరే విషయంలోనూ నాకు ఆయనపై కోపం లేదు అని చెప్పి, తన విమర్శలు పూర్తిగా పరిపాలనా విధానాలకే సంబంధించినవని వివరించారు.
కొత్త పార్టీపై కవిత వ్యాఖ్యలు
ఇటీవలి కాలంలో కవిత కొత్త పార్టీ స్థాపనపై చర్చలు ఎక్కువయ్యాయి. దీనిపై ఆమె క్లారిటీ ఇస్తూ కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే అంశంపై నేను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పారు. రాజకీయంగా తన తదుపరి అడుగులపై అన్ని వర్గాల వారితో చర్చలు జరుపుతున్నానని వివరించారు. ఒక వర్గం కోసం కాదు.. ప్రజలందరి కోసం పని చేయాలనుకుంటున్నాను.. బీసీ సమస్య నా మనసుకు దగ్గరైంది.. ప్రస్తుతం ఫ్రీ బర్డ్ని.. నా ద్వారాలు తెరిచె ఉన్నాయి.. చాలా మంది వచ్చి నన్ను కలుస్తున్నారు.. నాతో టచ్లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దిది అని అన్నారు.
ఈ సందర్భంగా ఆమె తన తండ్రి కేసీఆర్ విధానాన్ని గుర్తు చేశారు. పార్టీ పెట్టేముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారు. ప్రస్తుతం నేనూ అదే చేస్తున్నాను అని చెప్పారు. అంటే త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం కంటే, పరిస్థితులను సమీక్షించి తర్వాతే నిర్ణయం తీసుకుంటానని ఆమె అర్థం చేశారు.
కాంగ్రెస్‌లో చేరే ఆలోచనలేదని స్పష్టం
కవిత మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాన్ని పూర్తిగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన నాకు అస్సలు లేదు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ నాకు ఫోన్ చేయలేదు. నేనూ కాంగ్రెస్‌లో ఎవరినీ అప్రోచ్ కాలేదు అని ఆమె స్పష్టంగా చెప్పారు.
సస్పెన్షన్ అంశంపై వ్యాఖ్య
తండ్రి పార్టీ నుండి సస్పెండ్ అయిన తన పరిస్థితిని గుర్తుచేసుకుంటూ, తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని నేనే అని అన్నారు. ఈ వ్యాఖ్య ద్వారా కుటుంబ రాజకీయ పరిణామాల్లో తనకు ఎదురైన కష్టాలను గుర్తు చేస్తూనే, ఆ అనుభవం తనను మరింత బలపరిచిందని సూచించారు.
రాజకీయ పరిశీలన
కవిత తాజా వ్యాఖ్యలు రాజకీయ రంగంలో.. అనేక ప్రశ్నలను తెచ్చాయి. హరీష్ రావుపై అవినీతి ఆరోపణలు చేయడం ఒకవైపు బీఆర్ఎస్‌లో ఉన్న పాత విభేదాలను మళ్లీ తెరమీదకు తెచ్చింది. మరోవైపు కొత్త పార్టీ అంశంపై స్పష్టత ఇవ్వకుండా ఉంచడం, ప్రజలతో, మీడియాతో చర్చల్లో తన ప్రాధాన్యతను నిలుపుకోవడానికి ఒక వ్యూహంగా కనిపిస్తోంది.
Also Read: నాలుగో రోజు క్యాప్స్ గోల్డ్ కంపెనీలో ఐటీ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
మొత్తానికి, కవిత వ్యాఖ్యలు ఒక వైపు బీఆర్ఎస్‌లోని అంతర్గత రాజకీయాలను కదిలిస్తే, మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో తన స్వంత స్థానం ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్న సంకేతాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే నెలల్లో ఆమె తీసుకునే నిర్ణయాలు రాజకీయ సమీకరణాలను గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.