Kalvakuntla Kavitha: తెలంగాణలో రూ.లక్ష కోట్ల భూములను పెద్ద వాళ్లకు అప్పనంగా ఇచ్చే కుట్ర జరుగుతోందని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత ఆరోపించారు. హైడ్రా అనే బూచిని చూపించి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందా చేస్తున్నారని పేర్కొన్నారు. వాటిని పూర్తి ఆధారాలతో బయటపెడతామని కవిత హెచ్చరించారు. తెలంగాణ భూములను రక్షించేందుకు భూపోరాటాలు చేస్తామని.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లైనా లీగల్ ఫైట్ కు దిగుతామని పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వ కోరల నుంచి భూములను కాపాడుతామని కవి అన్నారు.
జూబ్లీహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అప్పులు పుట్టడం లేదంటూ భూములు అమ్ముకుంటూ పోతే ఎలా అని ఆమె ప్రశ్నించారు. హైడ్రా అనే సంస్థ కూకట్ పల్లిలోని మంజీర కాలనీకి వెళ్లి పేదల ఇళ్లను ఖాళీ చేయించిందని అన్నారు. అదే సమయంలో మూసీకి మరకగా మారిన, రివర్ బెడ్ లోనే కడుతున్న శ్రీ ఆదిత్య బిల్డింగ్ ను మాత్రం ఎందుకు టచ్ చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో తాము ఆ బిల్డింగ్ వద్ద ధర్నా చేస్తే హైడ్రా వాళ్లు మా మీద దాడి చేసే ప్రయత్నం చేశారని కవిత ఆరోపించారు. ఆధారాలు చూపించిన తర్వాత ఒక్క మాట మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీ ఆదిత్య బిల్డర్స్ వెనుక ఒక ఎంపీ ఉన్నారని కవిత ఆరోపించారు. ఆయన పేరు తర్వలోనే బయటపెడుతామని హెచ్చరించారు. ప్రేమవతి పేట పెద్ద చెరువు కు సంబంధించిన 7 ఎకరాలను కబ్జా చేశారని కవిత ఆరోపించారు. ఇందుకు పాల్పడ్డవారిని ముట్టుకునే దమ్ము హైడ్రాకు ఉందా? అని ప్రశ్నించారు. దీని మీద ఆధారాలతో సహా కచ్చితంగా ఫిర్యాదు చేస్తామని కవిత పేర్కొన్నారు. మరోవైపు మెగాకు చెందిన ఐకాం అనే ఆయుధాల తయారీ సంస్థ నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఐదు ఎకరాలు కబ్జా చేసిందని కవిత ఆరోపించారు. మేడి బావి, జాలు బావి చెరువుల వద్ద ఐదు ఎకరాలు కబ్జా చేశారంటూ అక్కడి మున్సిపాలిటీలో తీర్మానం కూడా చేశారని గుర్తుచేశారు. ఆ సంస్థపై చర్య తీసుకునే దమ్ముందా? అంటూ హైడ్రాను కవిత నిలదీశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే చివరి ప్రభుత్వమని కవిత అన్నారు. మరో 20 ఏళ్లు ఆ పార్టీని బొందపెట్టే విధంగా రేవంత్ రెడ్డి పనితీరు ఉందని విమర్శించారు. తెలంగాణ వనరులను, సంపదను, భూములను బందిపోట్ల మాదిరిగా దోచుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ఈ అవినీతికి బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ తలుపులు తెరిచిందని దుయ్యబట్టారు. ప్రాణం పోయినా ఇంచు భూమిని కూడా దోపిడి కానివ్వమని పేర్కొన్నారు. గతంలో ఫినిక్స్ సంస్థకు బీఆర్ఎస్ 50 ఎకరాల వరకు ధారాధాత్తం చేస్తే.. ఇదే ముఖ్యమంత్రి అప్పుడు వ్యతిరేకిస్తూ మాట్లాడారని కవిత అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక మరో వంద ఎకరాలు కలిసి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
‘పవన్ భూమి తిరిగివ్వాలి’
తెలంగాణ వచ్చిన తర్వాత 11 రోజులు అన్నం తినకుండా బాధపడిన పవన్ కళ్యాణ్ ఆ బాధలో ఇక్కడ భూములు కొన్నారని కవిత ఆరోపించారు. కానీ అది కోడికుంట అనే చెరువు లో 10 ఎకరాల శిఖం భూమినే కొన్నారని పేర్కొన్నారు. ‘ఆ భూమికి సంబంధించి సర్వే నంబర్ 706. ఇది శిఖం భూమియే అని ఇరిగేషన్ శాఖ నోటిఫై కూడా చేసింది. కానీ రిజిస్ట్రేషన్ లో చాలా తప్పులు చేశారు. మూడు ఎకరాలు మాత్రమే శిఖం అని మిగతాది మాగాణి అంటూ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ అంశం బయటకు వచ్చాక దీని గురించి తెలుసుకుంటే చాలా వివరాలు తెలిశాయి. శిఖం భూములు కొన్న పవన్ కళ్యాణ్ వెంటనే ఆ భూములను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలి. రైతులకు ఇచ్చిన విధంగా ఆయనకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. శిఖం భూమి అయితే భూమి వాపస్ ఇస్తా అని మీరే చెప్పారు? వెంటనే ఆ భూమి రిటర్న్ ఇచ్చేయాలి’ అని కవిత డిమాండ్ చేశారు.
Also Read: ఫ్రిడ్జ్‌లో రూ.1 నాణెం.. తర్వాత జరిగే బెనిఫిట్స్ చూస్తే.. దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందే!