ఓవైపు రజతోత్సవం అంటూ బీఆర్ఎస్ నేతలు ఎక్కడలేని హడావిడి చేస్తున్నారు. గోడల మీద పెయింటింగ్స్ వేస్తూ చాలామంది నేతలు ఫొటోలు దిగుతున్నారు, వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. ఈ వీడియోలపై కూడా ట్రోలింగ్ నడుస్తోంది. ఇన్నాళ్లూ ఈ ఆర్టిస్ట్ లంతా ఎక్కడికి వెళ్లిపోయారంటూ జోక్ లు పేలుస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా ఒక ఫొటో షేర్ చేశారు. ఆ ఫొటో ఇప్పుడు టాక్ ఆఫ్ సోషల్ మీడియాగా మారింది. రజతోత్సవ ప్రచారం అని బీఆర్ఎస్ నేతలు అనుకున్నారు కానీ, ఆ ఫోటో ఇప్పుడు బీఆర్ఎస్ పాలన డొల్లతనాన్ని బయటపెట్టింది, కేసీఆర్ పరువు తీసింది. పార్టీ రజతోత్సవ వేళ కవిత ఈ ఫొటోతో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టయింది.
9 ఏండ్ల బంగారు తెలంగాణ నిజస్వరూపం ఈ ఫోటో.
డబుల్ బెడ్ రూం ఇండ్లు అన్నాడు
జాగా ఉన్నొల్లకు ఇల్లు కట్టుకుంటే పైసలు అన్నాడు.
ఆఖరికి నల్ల కవర్ కప్పుకొని ఉండే విధంగా పాలన చేసిండు.
అయ్య చేసిన బ్రమండమైన పాలన చూపిస్తున్న రౌడీ బిడ్డ. pic.twitter.com/zzL5ia3uFo
— 𝐒𝐚𝐟𝐟𝐫𝐨𝐧 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) April 18, 2025
బీఆర్ఎస్ పాలన ఇలా..
9 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంతో అబివృద్ధి చెందిందని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు చూస్తూనే ఉన్నాం. కానీ గత బీఆర్ఎస్ పాలనలో పల్లెలు ఎలా ఉన్నయనే విషయాన్ని కవిత తన ఫొటో ద్వారా చెప్పకనే చెప్పారంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా వాల్ పెయింటింగ్ వేసిన ఇంటి గోడ పక్కన కవిత నిలబడి ఫొటో దిగారు. అది ఒక పెంకుటిల్లు. పెంకులు కూడా అక్కడక్కడ ఊడిపోయాయి. ఇల్లు ఉరుస్తుందేమో.. పైన నల్లటి కవర్ ని కప్పి ఉంచారు. బీఆర్ఎస్ పాలనలో పల్లెల్లో పరిస్థితి ఇలానే ఉంది అంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
వేర్ ఈజ్ డబుల్ బెడ్ రూమ్..
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తానంటూ కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ హామీ వట్టి డొల్ల అని కాలక్రమంలో ప్రజలకు తెలిసొచ్చింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం కట్టించి ఇవ్వలేదు, అదే సమయంలో ఇళ్లు కట్టుకుంటే డబ్బులిస్తామని చెప్పిన హామీని కూడా నిలబెట్టుకోలేదు. అందుకే ప్రజలు ఆ పార్టీని ఓడించారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా కవిత సోషల్ మీడియాలో పెట్టిన ఫొటో గత బీఆర్ఎస్ పాలనకు అద్దం పడుతోందని అంటున్నారు. 9 ఏళ్ల బంగారు తెలంగాణకు ఈ ఫొటో అసలు సిసలైన ఉదాహరణ అంటూ కౌంటర్లిస్తున్నారు.
కవితకు బ్యాడ్ టైమ్..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి వచ్చిన తర్వాత కవితకు వరుసగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆమధ్య సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఆమెకు రివర్స్ లో తగిలాయి. జనసేన ఓ రేంజ్ లో కవితని ట్రోల్ చేసింది. ఆ తర్వాత తెలంగాణ యాస అంటూ ఆంధ్ర ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారాయి. తాజాగా రజతోత్సవ ప్రచారం కోసం ఆమె అప్ లోడ్ చేసిన ఫొటో కూడా ఆ పార్టీ పరువు తీసేలా ఉంది. టోటల్ గా ఇది కవిత సెల్ఫ్ గోల్ అని చెప్పక తప్పదు. తన పరువు తానే తీసుకునే క్రమంలో పార్టీ పరువు, మాజీ సీఎం కేసీఆర్ పరువు కూడా తీసేశారు కవిత. కాంగ్రెస్ ట్రోలింగ్ కి బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పుకునే స్థితిలో కూడా లేకపోవడం విశేషం.