KCR Speech: 25ఏళ్ల నాడు ఈ గులాబీ జెండా ఎగిరిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కన్నతల్లి, జన్మభూమిని మించిన స్వర్గం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు విలన్ నెంబర్-1 కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ సాధన కోసమే పుట్టిన గులాబీ జెండా..
‘రజతోత్సవ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలకు వందనం. 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర విజయాన్ని ఓరుగల్లుతో జరుపుకుంటున్నాం. ఆనాడు జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం చరిత్రను మలుపుతిప్పింది. తెలంగాణ సాధన కోసమే గులాబీ జెండా పుట్టింది. పదవుల త్యాగంతోనే ప్రస్థానం ప్రారంభమైంది’ అని అన్నారు.
60 ఏళ్ల సమైక్య పాలనలో ఎంతో గోస పడ్డాం
‘వలసవాదుల నుంచి తెలంగాణను విముక్తి కల్పించాం. గులాబీ జెండాను ఎంతోమంది అవమానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక్కడినే బయల్దేరాను. తెలంగాణ ఉద్యమం అద్భుతంగా ఎగిసిపడింది. కొందరు వెటకారంగా మాట్లాడారు. ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టమని చెప్పాను. 60 ఏళ్ల సమైక్య పాలనలో ఎంతో గోస పడ్డాం. చీకట్లను పారదోలడానికి ఉద్యమాన్ని ప్రారంభించాం’ అని పేర్కొన్నారు.
రాష్ట్రం కోసం పదవులనే త్యాగం చేశాం..
‘గోదావరి, కృష్ణా జలాలు దక్కకుండా పోయాయి. కృష్ణా నీళ్లను తరలించుకుపోతుంటే మౌనంగా ఉన్నారు. తెలంగాణ పదం పలకడం కూడా అనాడు తప్పన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు పదవుల కసం మౌనంగా ఉన్నారు. తెలంగాణ కోసం మేం పదవులు త్యాగం చేశాం. పదవుల కోసం కాంగ్రెస్ నేతలు ప్రజలను ఆగం చేశారు. అసెంబ్లీలో తెలంగాణ అనకూడదని చంద్రబాబు చెప్పారు. తెలంగాణ అనే పదాన్నే నిషేధించే ప్రయత్నం చేశారు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
సీఎంగా ఉండేవాళ్లు గాంభీర్యం, ధైర్యంతో ఉండాలి..
‘సీఎంగా ఉండేవాళ్లు గాంభీర్యం, ధైర్యంతో ఉండాలి. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు. కాని అది చాలా కష్టం. కాంగ్రెస్ కు ఇంకా రెండున్నర ఏళ్లు మాత్రమే ఉంది. మాట్లాడితే భూములు అమ్ముతామంటున్నారు. ఏ భూములు అమ్మాలో విచక్షణ ఉండాలి. వర్సిటీల భూములను అమ్మితే ఎవరూ సహించరు.అవసరానికి భూములు అమ్మడంలో తప్పులేదు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. పాలన చేతకాక రాష్ట్రాన్ని దివాలా తీయించారు’ అని కేసీఆర్ ఆరోపించారు.
Also Read: Hyderabad News: హైదరాబాద్ నుంచి నలుగురు పాకిస్థానీలు జంప్.. మిగిలినవారు..?
మాజీ సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వకుండా వేధించారు..
‘కాంగ్రెస్ సర్కార్ అన్నింటిలోనూ ఫెయిల్ అయ్యింది. సంచులు నింపుడు.. మోయడంలో పాస్ అయ్యింది. కమిషన్లు అడుగుతున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు. మాజీ సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వకుండా వేధించారు. కేసీఆర్ అసెంబ్లీకి రా అంటూ మాట్లాడుతున్నారు. పిల్లలు అడిగితేనే మీరు ఆన్సర్ ఇవ్వడం లేదు. కేసీఆర్ అడిగే ప్రశ్నలకు భుజాలు తడుముకుంటున్నారు. మీ సోది కబుర్లు వినడానికి నేను అసెంబ్లీకి రావాలా..?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలి..
‘కేంద్రంలో 11 ఏళ్లుగా బీజీపీ పాలిస్తోంది. ఇంతవరకు తెలంగాణకు 11 రూపాయలు కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలి. ప్రభుత్వం చర్చలకు సిద్ధమని మావోయిస్టులు అంటున్నారు. ఏరిపారేస్తాం.. కోసిపారేస్తాం.. అంటే సరికాదు’ అని కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
కింద ఉన్న బటన్ నొక్కి లైవ్ చూడండి.