BIG BREAKING: కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు పీసీ కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 5న విచారణకు హాజరు రావాలని కమిషన్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని ఆయన నిర్ణయించుకున్నారు.
అయితే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానా లేదంటే స్వయంగానా అనేది తెలియాల్సి ఉంది. కేసీఆర్ అంగీకరిస్తే ఫామ్ హౌస్‌కు కూడా విచారణ సభ్యులను పంపిస్తామని గతంలోనే కమిషన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ALSO READ: Kavitha Vs BJP : కవితకు బీజేపీ భయపడుతోందా? భయపెడుతోందా?
తెలంగాణలోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో అవకతవకలపై గత కొన్ని నెలల నుంచి విచారణ జరుపుతోంది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. గతేడాది మార్చి 13న రేవంత్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఏర్పాటు చేసిన ఇప్పటికి 14 నెలలు పూర్తి కావచ్చింది. ఏడుసార్లు కమిషన్ గడువు పొడిగించింది ప్రభుత్వం. ఇప్పటివరకు 109 మంది ఆఫీసర్లు, వ్యక్తుల స్టేట్మెంట్ రికార్డు చేసింది. ప్రభుత్వం ఉద్యోగులంతా పైస్థాయి అధికారులు చెప్పినట్టే చేశామని కమిషన్ ముందు ప్రస్తావించారు. వారి ఇచ్చిన వివరాల ఆధారంగా ఆనాటి బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం పెద్దలు కేసీఆర్, హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌కు మే 20న నోటీసులు ఇచ్చిన విషయం తెలసిిందే. కేసీఆర్ జూన్ ఐదులోగా విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ప్రస్తావించింది.
కేసీఆర్ హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు హరీశ్ రావు. అప్పుడు ఆర్థికశాఖ మంత్రిగా ఈటెల ఉన్నారు. బీఆర్ఎస్ హయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఈ ముగ్గురు కీలకపాత్ర పోషించారని అభిప్రాయం పడింది. ఈ క్రమంలో నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, కుంగిపోవడం, లీకేజీలు వాటిపై కమిషన్ విచారణ చేపట్టింది. దీని నిర్మాణానికి భారీగా నిధులు ఖర్చు చేసింది అప్పటి ప్రభుత్వం. రెండేళ్ల కిందట సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజీలో నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. ఆ తర్వాత మిగతా బ్యారేజీల్లో సమస్యలు తలెత్తాయి.
ఈ వ్యవహారం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆందోళన కలిగించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సమగ్ర విచారణకు ఆదేశించింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను నియమించిన విషయం తెల్సిందే. ప్రాజెక్ట్ ప్లాన్, డిజైన్, ఖర్చు, అమలు వంటి అంశాల్లో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో విచారణకు పిలవాలని కమిషన్ నిర్ణయించింది. ఈ కమిషన్ గడువు మే 31 నాటితో ముగియనుంది. వచ్చేవారం కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి ఇస్తుందని భావించారు. అధికారులు, కాంట్రాక్టరు అందరూ అప్పటి ప్రభుత్వంపై వేలెత్తి చూపారు. అప్పటి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించినవారిని విచారించకుండా నివేదిక ఇవ్వడం కరెక్టు కాదని కమిషన్ అభిప్రాయం పడింది.
ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కమిషన్ గడువు ఏడోసారి పెంచింది. జులై 31 వరకు అవకాశం ఇచ్చింది. ఈలోగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెలను విచారించనుంది. ఈక్రమంలోనే కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానా లేదంటే స్వయంగానా అనేది తెలియాల్సి ఉంది. వారిచ్చిన స్టేట్‌మెంట్‌ను నివేదికలో పొందుపర్చనుంది. ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించిన తర్వాత అప్పుడు వారిపై చర్యలు తీసుకునే అవకాశముంది.