Manchu Manoj: మంచు మనోజ్ (Manoj)చాలా సంవత్సరాల తర్వాత వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం భైరవం(Bhairavam). ఈ సినిమా మరొక రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ ముగ్గురు హీరోలు కూడా వివిధ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అయితే మంచు మనోజ్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న నేపథ్యంలో ఆయనకు సినిమా కంటే కూడా తన ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
మంచు మనోజ్ ఎప్పుడైతే భూమా మౌనిక(Bhuma Mounika)ను పెళ్లి చేసుకున్నారో ఆ క్షణం నుంచి తన ఇంట్లో తన అన్నయ్య తండ్రితో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి భూమా మౌనికను పెళ్లి చేసుకోవటం మంచు విష్ణు(Vishnu)కి ఇష్టం లేదనే సంగతి తెలిసిందే. పెళ్లిలో కూడా ఈయన ఒక అతిథిగా వచ్చి వెళ్లారే తప్ప ఒక అన్నయ్యగా పెళ్లిలో పాల్గొనలేదు. ఇక ఈ గొడవల నేపథ్యంలో మంచు విష్ణు తన భార్య మౌనికను కూడా బాధపెట్టారని మనోజ్ పలు సందర్భాలలో తెలియజేశారు. ఇలా మంచు విష్ణు మనోజ్ ఇద్దరూ తరచూ గొడవలు పడటమే కాకుండా రోడ్లపైకి వచ్చి కొట్టుకోవడం, ఒకరిపై మరొకరు పోలీస్ కేసులు పెట్టుకోవడం వంటివి జరిగాయి. ఇలా ఈ అన్నదమ్ముల మధ్య గొడవలు తారా స్థాయికి చేరడంతో ఈ గొడవలు ఆస్తి కోసమేనని అందరూ భావించారు. అయితే మనోజ్ విష్ణుతో గొడవకు కారణం ఏంటో తెలిపారు. తాజాగా భైరవం ప్రమోషన్లలో భాగంగా మరోసారి తన ఇంట్లో జరుగుతున్న గొడవలు గురించి క్లారిటీ ఇచ్చారు.
విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది..
తన అన్నయ్య విష్ణుతో గొడవలకు కారణం యూనివర్సిటీ అని తెలిపారు. యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది అయితే ఈ విషయాలన్నీ నాన్నకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారికి జరుగుతున్న అన్యాయం గురించి నాన్నకు తెలియచేయాలని నేను ప్రయత్నిస్తుంటే నాన్నను కలవకుండా నన్ను అడ్డుకుంటున్నారు. యూనివర్సిటీ విద్యార్థుల క్షేమం గురించి వారికి జరుగుతున్న అన్యాయం కోసమే తాను పోరాటం చేస్తున్నాను తప్ప అందరూ అనుకున్నట్టు ఆస్తి కోసం కాదని మనోజ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.
ఆస్తులు నాకు అవసరం లేదు…
అందరూ అనుకున్న విధంగా ఆస్తుల కోసమైతే వారితో గొడవపడే అవసరం నాకు లేదని మనోజ్ తెలిపారు. నేనెప్పుడూ నాన్న ఆస్తి కోసం తాపత్రయపడలేదని, నా ముందు అన్యాయం జరుగుతుంటే తాను సహించనని ముఖ్యంగా విద్యార్థులు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నాకు తెలియజేయడంతోనే ఈ పోరాటం మొదలుపెట్టానని మనోజ్ తెలిపారు. ఈ విధంగా మనోజ్ ఎప్పటికప్పుడు తన ఇంట్లో జరుగుతున్న గొడవలు గురించి క్లారిటీ ఇస్తూనే వచ్చారు కానీ ఇప్పటివరకు మంచు విష్ణు మాత్రం ఎక్కడ ఈ గొడవల గురించి స్పందించలేదు. ఒకవేళ ఈయన ప్రెస్ మీట్ పెట్టిన గొడవల గురించి సరైన సమాధానం ఇవ్వకుండా ప్రశ్నలను దాటి వేస్తున్నారు.