
DK Aruna MLA case update(Political news in telangana):
గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే విధించింది. కృష్ణమోహన్‌రెడ్డిని తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంలో కృష్ణమోహన్‌రెడ్డి సవాల్ చేశారు. ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
2018 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ లో కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారని తెలంగాణ హైకోర్టును డీకే అరుణ ఆశ్రయించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డీకే అరుణ ఆయన చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ డీకే అరుణ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
డీకే అరుణ దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు.. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఇప్పటికే ఆమెను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ ను డీకే అరుణ దాఖలు చేశారు.