
Chandrababu naidu arrest live updates(Latest news in Andhra Pradesh) :
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను ఆదివారం అర్ధరాత్రి తర్వాత సీఐడీ అధికారులు రాజమండ్రి తరలించారు. సెంట్రల్ జైలులోని స్నేహ బ్లాక్ లో చంద్రబాబును ఉంచారు. అయితే ఆయన దిన చర్య జైలులో ఎలా సాగుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ క్రమంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
ఆదివారం అర్ధరాత్రి తర్వాత జైలుకు వచ్చినా.. ఉదయమే చంద్రబాబు నిద్ర లేశారని తెలుస్తోంది. ఆయన ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారనేది తెలిసిందే. జైలులో కూడా ఆయన యోగాతోనే దినచర్య ప్రారంభించారని సమాచారం.
చంద్రబాబు వయస్సు 73 ఏళ్లు దాటింది. ఈ వయస్సులోనూ ఆయన ఎంతో ఉత్సాహంగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దానికి కారణం ఆయన ఆరోగ్యం. ఆహార నియమాలు పక్కాగా పాటిస్తారు. మితంగా ఆహారం తీసుకుంటారు. జైలులోనూ అదే ఆచరిస్తున్నారు.
జైలుకు తన ఇంటి నుంచే ఆహారం పంపేందుకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబు న్యాయస్థానాన్ని కోరారు. అందుకు కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు ఇంటి నుంచే అల్పాహారం వెళ్లింది. ఫ్రూట్ సలాడ్, వేడి నీళ్లు, బ్లాక్ కాఫీని కుటుంబసభ్యులు పంపారు. యోగా చేసిన తర్వాత వేడి నీళ్లు , బ్లాక్ కాఫీ, ఫ్రూట్ సలాడ్ తాగారు. ఇలా జైలులో తొలిరోజు ఉదయం చంద్రబాబు దినచర్య సాగింది.