
TDP party latest news(AP political news):
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు , నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు రోడ్డెక్కారు. ఈ క్రమంలోనే చాలా ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ ను గృహనిర్బంధం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసుల కళ్లుగప్పి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు శ్రీరామ్ వెళ్లారు. రోడ్డుపై బైఠాయించిన పరిటాల శ్రీరామ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో పోలీసులు, టీడీపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది.ఆ తర్వాత
ధర్మవరం పోలీస్ స్టేషన్‌కు టీడీపీ నాయకులను తరలించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి అఖిలప్రియను గృహనిర్బంధం చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఫరూక్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.
చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బంద్ నిర్వహించారు. ఎన్టీఆర్ బస్టాండ్ వద్ద ఆర్టీసీ డిపోలో బస్సులు నిలిపేశారు. ఉండవల్లిలో టీడీపీ కార్యకర్తలు సీఎం జగన్ దిష్టి బొమ్మను తగులబెట్టేందుకు యత్నించారు. ఉండవల్లి సెంటర్‌లో టీడీపీ మహిళా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. తుళ్లూరులో గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
జగ్గయ్యపేటలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మైలవరంలో టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడ గ్రామీణంలో టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్‌లో ఆందోళన చేస్తున్న బుద్ధా వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసున్నారు. విజయవాడ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బస్టాండ్ నుంచి బయటకు రాకుండా బస్సుల అడ్డుకున్నారు. కిందపడటంతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
ఎమ్మెల్యేకు స్వల్పంగా గాయమైంది.
అవనిగడ్డ నియోజకవర్గంలో బంద్ నిర్వహిస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గుడివాడలో టీడీపీ నేతలు రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రామును హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను గృహనిర్బంధం చేశారు. సీఎం జగన్ కక్షపూరిత రాజకీయాలే రాష్ట్రంలో నేటి పరిస్థితులకు కారణమని కన్నా అన్నారు. తాను జైల్లో ఉండివచ్చిన కారణంగా అందరినీ జైల్లో పెట్టాలనే కసితో జగన్ ఉన్నారని విమర్శించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని హౌస్ అరెస్టు చేశారు.
మరోవైపు విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఏపీ గవర్నర్ నజీర్ ను కలిశారు. ఆయన గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జీ వెళ్లారు. రాష్ట్రంలో పరిణామాలను గమనిస్తున్నాని గవర్నర్ తెలిపారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. నాలుగేళ్ల పాలనలో అవినీతి కనిపించలేదా..? ఇప్పుడే ఎందుకు తెలిసిందని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా 15 ఎంపీ సీట్లు వస్తాయని సర్వేలో తెలిందన్నారు. జనసేనతో కలిసి పోటీ చేస్తే వైసీపీ అడ్రస్ గల్లంతవుతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయన్నారు.