Yadadri Power Plant: తెలంగాణలో రాజకీయ వేడి మళ్లీ రాజుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం కమిషన్ల కక్కుర్తి కోసమే ప్రతిష్టాత్మక యాదాద్రి పవర్ ప్లాంట్‌ను నిర్మించారంటూ ఆయన సంచలన ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత పేరుతో అప్పట్లో భారీ అక్రమాలకు తెరలేపారని మండిపడ్డారు.
బొగ్గు కొరత తెలిసినా నిర్మాణం: కిషన్ రెడ్డి
యాదాద్రి పవర్ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గు మన రాష్ట్రంలో లేదా దేశంలో చాలా తక్కువగా దొరుకుతుందనే స్పష్టమైన కనీస ఇంగితం అప్పట్లో ప్రభుత్వానికి లేదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తికి రోజువారీగా దాదాపు 14,000 నుంచి 16,000 మెట్రిక్ టన్నుల వరకు బొగ్గు అవసరం అవుతుంది. మన దేశంలో ఆ స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వాస్తవాలన్నీ తెలిసే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్లుమూసుకుని ప్లాంట్ నిర్మాణం చేపట్టిందని ఆరోపించారు.
విదేశీ దిగుమతుల వెనుక కమిషన్ల కుట్ర?
స్థానికంగా బొగ్గు లభ్యత లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అనివార్యమని తెలిసే బీఆర్ఎస్ పెద్దలు ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తెచ్చారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. విదేశాల నుంచి భారీగా కోల దిగుమతి చేసుకునే క్రమంలో తెర వెనుక పెద్దఎత్తున ముడుపులు దండుకోవాలన్నదే వారి అసలు కుట్ర అని విమర్శించారు. ప్రస్తుతం జీ 9 రకం బొగ్గును నైనీ కోల్ బ్లాక్, కోల్ ఇండియా నుంచి తరలిస్తున్నప్పటికీ, అసలు ప్రాజెక్ట్ రూపకల్పన సమయంలోనే భారీ కుంభకోణానికి బీఆర్ఎస్ బీజం వేసిందని ఆయన ఆరోపించారు. మరి దీనిపై గులాబీ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి!
Also Read: బోరబండలో ఘోర ప్రమాదం.. కారు ఢీకొని చిన్నారి మృతి!