GVMC Elections 2026: విశాఖ మహానగర పాలక సంస్థలో.. ఎన్నికల సందడి మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే అధికార యంత్రాంగం స్పీడ్ పెంచింది. 120 వార్డులు, 1,990 పోలింగ్ కేంద్రాలు, 18 లక్షల 30 వేల మంది ఓటర్లు. ఇటీవల జరిగిన రివ్యూలో.. జీవీఎంసీ కమిషనర్, అడిషనల్ ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ ఈ లెక్కలను వెల్లడించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి అధికారి నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఇప్పుడు.. అసలు దృష్టి అంతా భద్రతపైనే. మొత్తం 1,990 కేంద్రాల్లో 91 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. మరో 313 సమస్యాత్మకంగా, 393 క్రిటికల్‌గా వర్గీకరించారు. మిగిలిన 1,193 కేంద్రాలను సాధారణ కేంద్రాలుగా చూపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుని ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులు ఆదేశించారు.
భద్రతా ఏర్పాట్లపై కేతన్ గార్గ్ రివ్యూ!
ఎన్నికలకు ఎప్పుడైనా నోటిఫికేషన్ రిలీజయ్యే అవకాశముంది. దాంతో.. ఇప్పటికే రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ పూర్తయింది. ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులకు ఈ నెల 13, 14 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, పారిశుద్ధ్యం తప్పనిసరి అని కమిషనర్ స్పష్టం చేశారు. దివ్యాంగ ఓటర్ల కోసం ర్యాంపులు, వీల్‌చైర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కంచరపాలెం, గోపాలపట్నంలోని సామగ్రి పంపిణీ కేంద్రాలను కేతన్ గార్గ్ స్వయంగా పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌లు, సీసీటీవీ నిఘా, పోలీస్ కౌంటర్లపై ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. భీమిలి నుంచి అనకాపల్లి వరకు, మధురవాడ నుంచి గాజువాక, పెందుర్తి వరకు పది జోన్ల పరిధిలో సన్నాహాలు సాగుతున్నాయి. గాజువాకలో 19 వార్డులు, నార్త్ జోన్‌లో 20 వార్డులు ఉన్నాయి. ఈస్ట్ జోన్‌లో 18, వెస్ట్ జోన్‌లో 17, సౌత్ జోన్‌లో 16 వార్డులు ఉన్నాయి. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్ వస్తే చాలు.. క్లాక్ ఆన్ అవుతుంది. 18 లక్షల ఓటర్ల తీర్పు కోసం విశాఖతో పాటు ఉత్తరాంధ్ర మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
Also Read: ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు ఈసీ తరహా పవర్స్ ఉండాలి: కల్వకుంట్ల కవిత