BRS Party politics on assembly sessions: బడికి వెళ్లనంటూ పిల్లలు మారాం చేస్తారు. కానీ లక్షల ప్రజల ఓట్లతో విజయాన్ని అందుకున్న ఎమ్మేల్యేలు కూడా అసెంబ్లీకి డుమ్మా కొట్టే మార్గాలు వెతుక్కోవడం చూస్తుంటే, ఇదేమి రాజకీయమని అనిపించకమానదు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సంధర్భంగా తొలిరోజు జరిగిన దృశ్యాలను చూసి అక్కడంతా ఇదే చర్చ. అసలేం జరిగిందంటే..
వారంతా ఎమ్మేల్యేలు. చకచకా అసెంబ్లీ వైపు వెళుతున్నారు. కానీ కొందరు టీషర్ట్ ధరించి వచ్చారు. వారు మాత్రం అక్కడే ఆగిపోయారు. నినాదాలు సాగించారు. అదే అసెంబ్లీ లోపలికి అడుగు పెట్టిన వారు ప్రజా సమస్యలపై గొంతెత్తారు. బయట ఉన్న టీషర్ట్ ఎమ్మేల్యేలు మాత్రం వారనుకున్న ప్లాన్ ప్రకారం అక్కడి నుండి నేరుగా పోలీస్ వ్యాన్ ఎక్కారు. ఈ మాటలంటున్నది సోషల్ మీడియా అయితే.. అనిపించుకున్నది మాత్రం బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సభలో తెలంగాణ తల్లి గొప్పతనాన్ని, తెలంగాణ సాధనకై అమరులైన వారి త్యాగాలను స్మరించారు. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. అలాగే నాడు తెలంగాణ రాష్ట్రం ప్రకటించి, హామీని నెరవేర్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇలా హాజరైన ఎమ్మేల్యేలతో సభ నిండుగా ఉంది. కానీ ప్రతిపక్ష హోదా పొందిన బీఆర్ఎస్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది.
ఎక్కడైనా అసెంబ్లీకి వచ్చే ఎమ్మేల్యేలు తగిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఎవరైతే ఆ నిబంధనలను పాటించరో వారిని అసెంబ్లీ సిబ్బంది లోనికి అనుమతించరన్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష హోదాలో ఉండి, ప్రజా సమస్యలపై గొంతెత్తాల్సిన బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు మాత్రం టీషర్ట్స్ ధరించారు. ఆ టీషర్ట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి, అదానీ బొమ్మ ఉంది. అది కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ నిర్మాణానికి రూ.100 కోట్లు విరాళంగా ప్రకటించి సంబంధిత పత్రం సీఎం కు ఆదానీ అందజేస్తున్న ఫోటో. ఇక్కడే బీఆర్ఎస్ ను నెటిజన్స్ తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.
అదానీ రూ. 100 కోట్లు విరాళం ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ఆ విరాళాన్ని సీఎం రేవంత్ రెడ్డి తిరస్కరించినట్లు స్వయంగా మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆ విషయం కూడా తెలియకుండా టీషర్ట్స్ పై ఆ బొమ్మ ముద్రించుకొని, సీఎం కు అదానీకి సంబంధం ఉందంటూ చెప్పడం ఇదో వెరైటీ నిరసన అంటున్నారు నెటిజన్స్. అది కూడా అసెంబ్లీ సమావేశాల తొలిరోజే డుమ్మా కొట్టాలన్న ప్లాన్ తో, తమ ఉనికిని కాపాడుకొనేందుకు మాజీ మంత్రి కేటీఆర్ వేసిన స్కెచ్ అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.
ఈ తీరులో వెళ్తే అసెంబ్లీలోకి అనుమతి ఉండదని, అందుకే గేటు వద్ద కొద్దిసేపు నినాదాలు చేసి, మీడియా ముందు హల్చల్ చేసినట్లు బీఆర్ఎస్ లక్ష్యంగా ట్రోలింగ్ సాగుతోంది. మొత్తం మీద బీఆర్ఎస్ అనుకున్నది సాధించిందని కూడా చెప్పవచ్చు. శుభమా అంటూ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజే, భాద్యత గల ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీకి వెళ్లి తన వాణి వినిపించాల్సిన భాద్యత లేదా అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది.
చివర్లో పోలీసులు వారిని పోలీస్ వ్యాన్ ఎక్కించారు. వెంటనే పార్టీ కార్యాలయానికి వెళ్లి, రేపటి కార్యాచరణ ఎలా ఉండాలో కేటీఆర్, తమ పార్టీ ఎమ్మేల్యేలకు దిశా నిర్దేశం చేశారట. ఏదిఏమైనా తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభోత్సవంలో పాల్గొని, తమ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బీఆర్ఎస్ చేసిన తీరుతో రాజకీయ విశ్లేషకులు కూడా షాకయ్యారట.