Telangana Congress: తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు, పార్టీ అధిష్ఠానంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. మరోవైపు ఆయన సోదరుడు, మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి అండగా నిలుస్తూ.. ఆయనకు మద్దతుగా మాట్లాడుతుండటం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. ఆ క్రమంలో ఈ అన్నదమ్ములు వ్యవహారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
వైఎస్ శిష్యులుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కోమటిరెడ్డి సోదరులు
కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్స్. రాష్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న లీడర్స్. ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శిష్యులుగా రాజకీయాల్లోకి వచ్చి నల్లగొండ జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారు. గతంలో ఇద్దరు ఎం మాట్లాడిన ఎం చేసినా కలిసి కట్టుగా ముందుకు వెళ్ళే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదనే చర్చ జరుగుతుందట. అలా అని వారిద్దరి మధ్య గొడవలు కూడా ఏమి లేవని, ఇద్దరి అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయని వారి సన్నిహితులు అంటున్నారు.
అధికారంలోకి రాక ముందు పీసీసీ చీఫ్‌లపై మాటల దాడి
తెలంగాణ ఏర్పాటు తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ తమదైన శైలిలో రాజకీయం చేశారు. కాంగ్రెస్‌లో కొనసాగుతూనే తమతమ ఎజెండాలు నడిపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు పీసీసీ చీఫ్‌లుగా వ్యవహరించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ,రేవంత్ రెడ్డిలని ఇద్దరు వ్యతిరేకించి మాటల దాడి చేసేవారు.. తర్వాత కాంగ్రెస్‌ను కాదనుకుని రాజగోపాల్‌రెడ్డి పార్టీని వదులుకుని బయటకు వెళ్లి తిరిగొచ్చారు. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటే…మంత్రి పదవి రాని రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నారనే టాక్ కాంగ్రెస్‌లో నడుస్తోంది
సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని రాజగోపాల్ ట్వీట్
పదేళ్లు తానే సీఎం గా ఉంటా రాసి పెట్టుకో కెసిఆర్ అంటూ పాలమూరు నుంచి సవాల్ విసిరిన రేవంత్ రెడ్డికి ఆ మరునాడే ట్వీట్ ద్వారా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఎవరు సీఎం అనేది పార్టీలో నిర్ణయించి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని ట్వీట్ చేశారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్‌ను ఎవరూ పట్టించుకోనప్పటికి…ఆయన ట్వీట్ చేసిన మర్నాడే సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సీఎం రేవంత్‌పై రాజ్‌గోపాల్‌రెడ్డి అసంతృప్తి రాగం వ్యక్తం చేస్తుంటే ఆయన సోదరుడు వెంకట్‌రెడ్డి సీఎంకు మద్దతుగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: భారత్‌పై 50 శాతం TAX.. బాంబ్ పేల్చిన ట్రంప్..
రేవంత్ మళ్లీ సీఎం అవ్వాలని ఆకాంక్షించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లొండ జిల్లా కేంద్రంలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించాక సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణకు మళ్లీ మీరే సీఎం కావాలని ఆకాంక్షించారు. మరోసారి మీరు సీఎం అయ్యేందుకు గణపతి పూజతోపాటు హోమం కూడా చేశానని తన మనోగతాన్ని సీఎంతో పంచుకున్నారు మంత్రి కోమటిరెడ్టి. దీంతో అన్ని పార్టీల నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ పరస్పర వైఖరిపై చర్చించుకుంటున్నారట. అన్న ఇలా తమ్ముడు అలా మాట్లాడటం ఎవరికీ అంతు పట్టడంలేదట. అయితే సీఎం రేవంత్ కు మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చినట్లైందనే టాక్ పార్టీ నేతల్లో నడుస్తోందట. మంత్రి పదవి కాపాడుకోవడం కోసం ఒకరు మాట్లాడుతున్నారా…మంత్రి పదవి రాలేదనే కోపంతో మరొకరు మాట్లాడుతున్నారా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తోందట. మొత్తంగా అన్నదమ్ములిద్దరూ విరుద్ధంగా స్పందించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Story By Ajay kumar, Bigtv