
Konda Surekha: కొండా సురేఖ దంపతులు. కాంగ్రెస్ లో ఖతర్నాక్ లీడర్లు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి పట్టు. ఆమె మాజీ మంత్రి. అతను రెండుసార్లు ఎమ్మెల్సీ. అలాంటి కొండా సురేఖ పార్టీలో తన స్థాయికి తగ్గ పదవి రాలేదని అసహనం చెందారు. నేరుగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికెళ్లి మరీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాతే కొండా స్పూర్తిగా మిగతా సీనియర్లంతా అసంతృప్తి వెళ్లగక్కారు. కట్ చేస్తే.. అధిష్టానం దూతగా దిగ్విజయ్ రావడం.. రెండు రోజులు చర్చలు జరిపి ఢిల్లీ వెళ్లిపోవడం జరిగిపోయింది. ఇక అంతే. అంతకు మించి ఏ మార్పు లేదు. ఎక్కడి సమస్య అక్కడే ఉండిపోయింది. చిరాకొచ్చిన కొండా సురేఖ.. ఈసారి నేరుగా దిగ్విజయ్ సింగ్ కే లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. తనకు ఫలానా పదవే కావలంటూ.. అధిష్టానానికి రెండు ఆప్షన్లు ఇవ్వడం మరింత ఇంట్రెస్టింగ్ పాయింట్.
వీలైతే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. కుదిరితే ఏఐసీసీ సెక్రటరీ. అంతే, అంతకుమించి ఇంకేమీ వద్దు. ఇస్తే గిస్తే.. ఆ రెండిట్లో ఏదో ఒక పదవి తనకు ఇవ్వాలంటూ దిగ్విజయ్ సింగ్ కు లెటర్ పోస్ట్ చేశారు కొండా సురేఖ. ఆ లేఖను సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు. ఆ మేరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, దిగ్విజయ్ సింగ్‌లకు విజ్ఞప్తి చేశారు కొండా సురేఖ.
మహిళా సాధికారత సాధించేందుకు తనకు అన్ని నైపుణ్యాలు ఉన్నాయన్నారు. టీపీసీసీలోని మహిళలు దేశంలో ప్రత్యేకంగా ఉండేలా చేస్తానని అన్నారు. ఏఐసీసీ సెక్రటరీ లేదా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్‌లకు తాను అర్హురాలినని.. ఈ రెండు పదవుల్లో ఏది ఇచ్చినా.. వంద శాతం వాటికి న్యాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నట్టు లేఖలో తెలిపారు.
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోందని.. తనకు ఏఐసీసీ కార్యదర్శి లేదా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం ఇస్తే.. తన నైపుణ్యంతో కాంగ్రెస్ సీట్ల సంఖ్య పెరిగేలా కృషి చేస్తానని కొండా సురేఖ లేఖలో అన్నారు.
ఇచ్చిన పదవి తీసుకోవడం.. లేదంటే అసమ్మతి వెళ్లగక్కడం.. ఇన్నాళ్లూ ఇదే చూశాం. కానీ, కొత్తగా తనకు ఫలానా పదవే కావాలంటూ కొండా సురేఖ డిమాండ్ చేయడంపై కాంగ్రెస్ లో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. మరి, కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి.. టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచి.. అక్కడ టికెట్ రాలేదని మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చిన ఇలాంటి అవకాశవాద నేతలకు అడిగారని అంతటి కీలక పదవులు ఎలా కట్టబెడతారనేది అసలైన కాంగ్రెస్ వాదుల ప్రశ్న.
