Tata Punch Gets Costlier: టాటా మోటార్స్ కు చెందిన పాపులర్ మోడల్ పంచ్ కొనాలనుకునే వారికి బ్యాడ్‌న్యూస్. పంచ్, పంచ్ EV మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వేరియంట్‌ను బట్టి ధరలు రూ.5,000 నుంచి రూ.20,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పింది. టాటా పంచ్ ప్రస్తుతం కంపెనీ కీలక మోడళ్లలో ఒకటిగా కొనసాగుతోంది. పెట్రోల్, CNG వెర్షన్లతో పాటు ఎలక్ట్రిక్ మోడల్ కూడా అందుబాటులో ఉండటంతో ఈ కారు అన్ని రకాల కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పంచ్ EVకు మంచి స్పందన లభిస్తోంది.
పంచ్ ICE వెర్షన్ ధరలను వేరియంట్ ఆధారంగా రూ.5,000 నుంచి రూ.10,000 వరకు పెంచారు. తాజా పెంపు తర్వాత ఈ కాంపాక్ట్ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ.5.75 లక్షల నుంచి రూ.10.77 లక్షల మధ్య ఉంది. పెట్రోల్ మోడల్‌తో పాటు CNG వెర్షన్‌ను కూడా టాటా అందిస్తోంది. కొనుగోలుదారులు తమ అవసరాన్ని బట్టి మాన్యువల్, AMT గేర్ బాక్స్ ను తీసుకోవచ్చు.
ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ధరల పెంపు కొంత ఎక్కువగా ఉంది. 30kWh బ్యాటరీతో వచ్చే Smart, Smart+ వేరియంట్ల ధరలు రూ.10,000 వరకు పెరిగాయి. మరోవైపు 40kWh బ్యాటరీతో ఉన్న Smart+, Adventure, Empowered, Empowered+ S వంటి వేరియంట్లపై ఏకంగా రూ.20,000 పెంపు పడింది. దీంతో పంచ్ EV కొత్త ఎక్స్-షోరూమ్ ధరలు రూ.9.79 లక్షల నుంచి రూ.12.99 లక్షల వరకు ఉన్నాయి.
ధరలు పెరిగినప్పటికీ పంచ్, పంచ్ EVలో ఎలాంటి కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పులు, మెకానికల్ అప్‌డేట్స్ చేయలేదు. అంటే అదనపు సౌకర్యాలు లేకుండానే కొనుగోలుదారులు పెరిగిన ధర చెల్లించాల్సి ఉంటుంది. పంచ్ EV రెండు బ్యాటరీ ఆప్షన్లతో కొనసాగుతోంది. 30kWh బ్యాటరీ ప్యాక్‌తో 88PS ఎలక్ట్రిక్ మోటార్, 40kWh బ్యాటరీతో 130PS మోటార్ లభిస్తాయి. టాటా తెలిపిన వివరాల ప్రకారం, చిన్న బ్యాటరీ వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 375 కిలోమీటర్ల వరకు, పెద్ద బ్యాటరీ మోడల్ 468 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
పంచ్ EVకు వచ్చిన డిమాండ్ టాటా మోటార్స్‌కు ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో బలమైన స్థానాన్ని కొనసాగించడంలో సహాయపడుతోంది. FADA గణాంకాల ప్రకారం, 2026 ఆగస్టులో దేశంలో ఎలక్ట్రిక్ కార్ల రిటైల్ రిజిస్ట్రేషన్లు 52 శాతం పెరిగి 30,686 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ మార్కెట్లో టాటా మోటార్స్ 13,158 EV రిజిస్ట్రేషన్లతో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే కంపెనీ రిజిస్ట్రేషన్లు 63 శాతం పెరిగాయి. పంచ్ EV, నెక్సాన్ EV మోడళ్లు ఇందులో కీలకంగా ఉన్నాయి.
Read Also: ఒకటి రెండు కాదు ఒకేసారి 5 కొత్త కార్లు.. టాటా ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!