దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. తన మీద కేసు పెడితే నేను ఊరుకుంటా అనుకుంటే రేవంత్ రెడ్డి అంతే పిచ్చోడు మరొకరు ఉండరని అన్నారు. జైలు నుంచి వచ్చాక కూడా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన చిట్ చాట్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. లగచర్లలో భూముల సేకరణ అంశంలో ప్రభుత్వం తీవ్రంగా భంగపడిందని అన్నారు. దాన్ని కవర్ చేసుకునేందుకే ఇది కుట్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం రైతుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోందని, దాడి చేశారంటూ దాదాపు 50 మంది రైతులను స్థానిక ఎస్పీ దగ్గరుండి కొట్టించారని మండిపడ్డారు.
Also read: కేసీఆర్ నీ కంట కన్నీరైనా వచ్చిందా.. 21 ఏళ్లకే ఎమ్మేల్యే గా పోటీకి ఛాన్స్.. సీఎం రేవంత్ రెడ్డి
రైతులను పరామర్శించేందుకు వెళ్లిన తమ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో రైతులు ఆవేదన చెప్పుకున్నారని అన్నారు. ఇంకా ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్లను కొట్టి మిగతా పార్టీ వాళ్లను వదిలేశారని కేటీఆర్ ఆరోపించారు. సంఘటన జరిగినప్పుడు అక్కడ లేని బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకెళ్లి అమానుషంగా కొట్టారన్నారు. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే గతంలో మానవ హక్కుల గురించి మాట్లాడిన కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నిజంగా లగచర్లలో తాము కుట్ర చేసినట్లైతే మీడియా వాళ్లు వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చని చెప్పారు. మీరు ఆ గ్రామానికి వెళ్తే ప్రజలే ఏమీ జరిగిందో చెబుతారన్నారు. సురేష్ అనే వ్యక్తి తమ పార్టీ కార్యకర్తే అని ఆయనకు భూమి లేకపోయినా గొడవ చేశాడని అంటున్నారని తెలిపారు.
కానీ సురేష్‌కు భూమి ఉందని, భూమి లేని వాళ్లే గొడవ చేశారంటూ పోలీసులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. పోలీసులు, ఐపీఎస్ అధికారుల్లారా ఇంత స్వామి భక్తి వద్దు.. మళ్లీ నాలుగేళ్ల తర్వాత అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తప్పు చేసిన అధికారుల విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో అదే జరుగుతుందని హెచ్చరించారు. లగచర్లలో జరిగిన ఘటనలో పూర్తిగా ఇంటలిజెన్స్, పోలీసుల వైఫల్యం ఉందని అన్నారు. అభిప్రాయ సేకరణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఎందుకు అక్కడ లేరని నిలదీశారు. పట్నం నరేందర్ రెడ్డి తన పేరు చెప్పాడని రిమాండ్ రిపోర్ట్‌లో రాశారని. కానీ అదంతా బాక్వాస్ అని పట్నం నరేందర్ రెడ్డి లేఖ రాశారని అన్నారు.