E-Paper
Advertisement

నీట్ సంక్షోభం కేంద్ర ప్రభుత్వ ‘అట్టర్ ప్లాప్’.. ఆ మంత్రిని తొలగించాల్సిందే- కేటీఆర్

నీట్ సంక్షోభం కేంద్ర ప్రభుత్వ ‘అట్టర్ ప్లాప్’.. ఆ మంత్రిని తొలగించాల్సిందే- కేటీఆర్

KTR: స్వేచ్ఛ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘నీట్’ పరీక్షల కుంభకోణం, పేపర్ లీకేజీ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లోపభూయిష్టమైన వ్యవస్థ వల్ల నష్టపోయిన విద్యార్థులకు భరోసా కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని ఆయన ప్రధానిని కోరారు. తప్పు చేసిన పెద్దలపై చర్యలు తీసుకుంటేనే, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉంటాయనే బలమైన సందేహం బ్యూరోక్రాట్లలో వెళ్తుందని స్పష్టం చేశారు. నీట్ బాధితులు, లాంగ్ టర్మ్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.

ఇది ప్రభుత్వ ‘అట్టర్ ప్లాప్’

ఈ ముఖాముఖిలో విద్యార్థులు పాల్గొని తాము ఎదుర్కొంటున్న మానసిక క్షోభను కేటీఆర్ ముందు ఏకరవు పెట్టారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి 520కి పైగా మార్కులు సాధించినా, పేపర్ లీక్ కావడం వల్ల తమ శ్రమ అంతా వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లే ముందు తమను అణువణువూ తనిఖీ చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు, పేపర్ లీక్‌ను ఎందుకు అడ్డుకోలేకపోయారని విద్యార్థులు నిలదీశారు. తప్పు ఎన్టీఏ బోర్డు చేసి, విద్యార్థులను మళ్లీ మళ్లీ పరీక్షలకు కూర్చోబెట్టడం ఏ రకంగా న్యాయమని వారు ప్రశ్నించారు.

కేటీఆర్ మాట్లాడుతూ..

విద్యార్థుల ఆక్రోశంపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ‘మీ కోపంలో 100 శాతం న్యాయం ఉంది. ఈ పరీక్ష నిర్వహణలో ఇది ప్రభుత్వ అబ్సల్యూట్ ఫెయిల్యూర్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఏ ఘోరంగా విఫలమైంది. తప్పు చేసిన పెద్దలను వదిలేసి, మిమ్మల్ని మళ్లీ పరీక్షకు కూర్చోబెట్టడం ముమ్మాటికీ అన్యాయమే. కానీ, ఇదొక తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ లాంటిది. మీ కసిని, ఎనర్జీని సరైన దిశలో పెట్టి మళ్లీ ఫోకస్ చేయండి’ అని విద్యార్థుల్లో ధైర్యం నింపారు.

గ్రేస్ మార్కుల వెనుక పెద్ద మాయాజాలం!

గతంలో (2024) గ్రేస్ మార్కుల పేరిట జరిగిన అవకతవకలను, కటాఫ్‌లు అసాధారణంగా పెరిగిపోవడాన్ని ఒక విద్యార్థి ప్రస్తావించగా, కేటీఆర్ ఎన్టీఏ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ‘గ్రేస్ మార్కులు ఎందుకు కలిపారో చెప్పడానికి ఎన్టీఏ వద్ద ఇప్పటికీ ఎలాంటి తార్కిక సమాధానం లేదు. చాలా ఇర్రెస్పాన్సిబుల్‌గా వ్యవహరించి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. కొంతమందికి అడ్డదారిలో మార్కులు కలిపి, కష్టపడ్డ విద్యార్థులకు అన్యాయం చేయడం ఘోరమైన నేరం. ఈ లూప్‌హోల్స్ అన్నింటిపై పార్లమెంట్‌లో, స్టేట్ అసెంబ్లీలో గట్టిగా చర్చిస్తాం. చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చట్టసభ సభ్యులుగా మా బాధ్యత నెరవేరుస్తాం’ అని హామీ ఇచ్చారు.

పాలకులకు భయం ఉండాలి.. కేటీఆర్

‘మంత్రి రాజీనామా చేస్తే సమస్య పరిష్కారమవుతుందా?’ అని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ వ్యూహాత్మకంగా బదులిచ్చారు. ‘మంత్రి రాజీనామా ఒక హెచ్చరిక లాగా పనిచేస్తుంది. ప్రధాని గనుక మంత్రిని తొలగిస్తే.. తప్పు జరిగితే బాధ్యత వహించక తప్పదనే భయం అధికారుల్లో, బ్యూరోక్రాట్లలో వస్తుంది. లేకపోతే వ్యవస్థలో నిర్లక్ష్యంపెరుగుతుంది. స్కూల్లో బంక్ కొడితేనే పనిష్మెంట్ ఉన్నప్పుడు, వ్యవస్థను నాశనం చేసిన పెద్దలకు శిక్ష ఉండాలి. కొందరిని డిస్మిస్ చేసి కఠినంగా శిక్షిస్తేనే వ్యవస్థ దారిలోకి వస్తుంది’ అని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా రీ-నీట్ నిర్వహించాల్సిందేనా?

పేపర్ లీక్ అయిన రాష్ట్రాల్లోనే పరీక్ష పెట్టాలా? లేక దేశవ్యాప్తంగా నిర్వహించాలా? అన్న ప్రశ్నకు కేటీఆర్ బదులిస్తూ.. ఇవాల్టి కనెక్టెడ్ ప్రపంచంలో లీకైన పేపర్ మిగతా రాష్ట్రాలకు వెళ్లలేదని చెప్పలేం. ఒక కోచింగ్ సెంటర్‌లో పలు రాష్ట్రాల విద్యార్థులు ఉంటారు. ఎక్కడో ఒకచోట 1% లీక్ అయినా అది అందరికీ పాకుతుంది. కాబట్టి లీక్ పరిధిపై 100% స్పష్టత ఉంటే ఆయా రాష్ట్రాలకే పరిమితం చేయవచ్చు, లేదంటే దురదృష్టవశాత్తూ దేశవ్యాప్తంగా మళ్లీ నిర్వహించడం మినహా ప్రత్యామ్నాయం లేదు. అయితే, అసలు లీక్ కాకుండా ఉండేందుకు నేటి ఏఐ సాంకేతికతను వాడుకుని ‘ఫూల్ ప్రూఫ్’ సిస్టమ్స్ తేవడంపై కేంద్రం దృష్టి పెట్టాలన్నారు.

మెరిట్‌ను మింగేస్తున్న మేనేజ్‌మెంట్ కోటా

పైసలు ఉన్నవాళ్లు డొనేషన్లు కట్టి సీట్లు కొంటున్నారని, మెరిట్‌కు విలువ లేకుండా పోతోందని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేయగా.. కేటీఆర్ స్పందిస్తూ.. ‘డబ్బులు ఉన్నాయని డాక్టర్లు అయిపోయే ఈ విధానం అత్యంత అన్యాయమైనది. ప్రైవేట్ కాలేజీల దోపిడీని అడ్డుకోవడానికి బలమైన రెగ్యులేటరీ సిస్టమ్ రావాలి. రేపటి రోజున మన కుటుంబ సభ్యులకు బాలేకపోతే డబ్బులు ఉన్న డాక్టరా? మెరిట్ ఉన్న డాక్టరా? ఎవరికి చూపిస్తాం? కాబట్టి మేనేజ్మెంట్ సీట్లను తగ్గించి, మెరిట్ కే ప్రాధాన్యతనిచ్చేలా ఫీజులను, కోటాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది’ అని అభిప్రాయపడ్డారు.

ఒత్తిడిని లోపల దాచుకోవద్దు..

తీవ్ర ఒత్తిడి, ఆందోళనలో ఉన్న విద్యార్థులకు కేటీఆర్ ఒక తండ్రిలా, పెద్దన్నలా దిశా నిర్దేశం చేశారు. ‘నేను ఇద్దరు పిల్లల తండ్రిగా మీ బాధను, హెల్ప్‌లెస్‌నెస్‌ను అర్థం చేసుకోగలను. ఇలాంటి కష్ట సమయాల్లో భావోద్వేగాలను లోపలే దాచుకోవద్దు. అది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. మీ తల్లిదండ్రులతో, టీచర్లతో, స్నేహితులతో మాట్లాడండి, మీ బాధను పంచుకోండి. లైఫ్ ఇలాంటి బౌన్సర్లు విసురుతున్నప్పుడు బ్యాలెన్స్‌డ్‌గా ఎదుర్కోవడం అలవాటు చేసుకోవాలి’ అని హితవు పలికారు.

సీబీఎస్ఈ బోర్డు లోపాలు

గతంలో కొందరు విద్యార్థులు సీబీఎస్‌ఈ బోర్డు లోపాలను ఎండగట్టినట్లుగా, నీట్ లోపాలను కూడా తాము రాజ్యసభ సభ్యుల ద్వారా ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని, విద్యార్థుల తరఫున బీఆర్‌ఎస్ పార్టీ చివరి వరకు పోరాడుతుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

Also Read: కిషన్ రెడ్డివి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు.. ఎంపీ చామల సంచలన ఆరోపణలు!

Related News

పగలు బీజేపీ.. రాత్రి బీఆర్ఎస్.. కిషన్ రెడ్డిపై రేవంత్ ఫైర్!

కిషన్ రెడ్డివి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు.. ఎంపీ చామల సంచలన ఆరోపణలు!

ఫ్రీ చదువు, వైద్యం ఇవ్వకపోతే రాళ్లతో కొట్టండి.. కవిత సంచలన వ్యాఖ్యలు!

ఈ జన్మలో రాహుల్ గాంధీ ప్రధాని కాలేడు.. రాసిపెట్టుకోండి- కిషన్ రెడ్డి

కూకట్‌పల్లి ‘కింగ్స్ అండ్ క్వీన్స్’ పబ్‌పై డీసీపీ స్పై ఆపరేషన్.. 9 మంది అరెస్ట్!

బీజేపీ తలుచుకుంటే మంత్రులు ఇళ్లు దాటలేరు.. రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు!

వచ్చేది మా ప్రభుత్వమే.. రాసి పెట్టుకోండి.. రేవంత్‌కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్!

Big Stories

×