KTR: కేంద్రంలో ప్రధాని మోదీ, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఒకేరకంగా ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇద్దరూ కలిసి రాహుల్ గాంధీకి పెద్ద షాక్ ఇవ్వటం ఖాయమని వ్యాఖ్యానించారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలని ఇస్తానని ప్రధాని మోదీ, రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలని సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని కేటీఆర్ ఫైరయ్యారు. తెలంగాణ భవన్ లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు.
అక్కడ బడే భాయ్.. ఇక్కడ ఛోటే భాయ్..
‘బీజేపీకి, కాంగ్రెస్ లకు చెరో ఎనిమిది ఎంపీలుండి రాష్ట్రానికి ఏం చేశారు..? రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలా బీజేపీ పనిచేస్తోంది.. రేవంత్ ప్రతి తప్పును బీజేపీ ఎంపీలు కాపాడుతున్నారు.. కేంద్రంలో రేవంత్ బావమరిదిని బీజేపీ కాపాడితే.. తెలంగాణలో బీజేపీ ఎంపీకి రేవంత్ రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చారు. మోదీ, రేవంత్ ఇద్దరూ ఒక్కటే బడే భాయ్, ఛోటే భాయ్.. మధ్యలో రాహుల్ గాంధీ ఆటలో అరటి పండు అయ్యాడు. భవిష్యత్తులో రాహుల్ గాంధీకి రేవంత్ దెబ్బకొట్టడం ఖాయం.. ప్రశ్నించే వారిపై మోదీ ఈడీనీ పంపితే.. రేవంత్ ఏసీబీ కేసులు పెడుతాడు’ అని కేటీఆర్ మండిపడ్డారు.
ALSO READ: Jobs in RRB: రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు.. నెలకు రూ.35,400 జీతం.. డోంట్ మిస్
రిపేర్ చేయాల్సిన బాధ్యత లేదా..?
‘యూరియా కోసం రైతులు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడుతున్నారు. గోదావరి నీళ్లు తెలంగాణకు వద్దని బీజేపీ నేతలు అంటున్నారు. కిందనున్న ఆంధ్రా, తమిళనాడుకు గోదావరి నీళ్లు ఇస్తారంట. తెలంగాణ హిమాలయాలు కరిగించిన నీళ్లు ఇస్తారంట. అధికారంలోకి వస్తే పథకాల వరద పారిస్తామన్నారు. ఆరు గ్యారెంటీలు అమలవుతున్నాయా..? కేసీఆర్ రూ.73వేల కోట్ల రైతు బంధు వేశారు. ఇప్పుడు టకీటకీమని రైతుబంధు డబ్బులు పడుతున్నాయా..? రైతు బంధు పోయింది.. బోనస్ ఆగిపోయింది.. దళితబంధు రూ.12లక్షలు ఇస్తామన్నారు.. ఒక్కరికైనా ఇచ్చారా..? ఇదేనా రేవంత్ ప్రభుత్వం తెచ్చిన మార్పు’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘కుంగిన పిల్లర్లను రిపేర్ చేయాల్సిన బాధ్యత లేదా..? రెండు పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేశారు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.