Big Stories

KTR: సైఫ్ అయినా, సంజయ్ అయినా వదిలిపెట్టం.. ప్రీతి మృతిపై కేటీఆర్ రియాక్షన్..

KTR: వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐదు రోజల పాటు మృత్యువుతో పోరాడిన ప్రీతి ఆదివారం రాత్రి కన్నుమూసింది. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రీతి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ర్యాగింగ్ వల్ల ప్రీతి మృత్యువాత పడడం బాధాకరమన్నారు. నిందితుడు సైఫ్ అయినా.. సంజయ్ అయినా విడిచిపెట్టేదిలేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

ప్రభుత్వం, పార్టీ పరంగా ప్రీతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కొందరు అనవసరంగా ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -

హైదరాబాద్ నిమ్స్‌లో ఐదురోజులపాటు మృత్యువుతో పోరాడి ప్రీతి ఆదివారం రాత్రి 9.10 గంటలకు కన్నుమూసింది. దీంతో నిమ్స్‌ ఆసుపత్రిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రీతి మృతదేహాన్ని శవపరీక్ష కోసం నిమ్స్‌ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు యత్నించగా ఆమె తల్లిదండ్రులు తొలుత నిరాకరించారు. ప్రీతి మృతికి కారణాలేంటో తెలపాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 22 ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఏం జరిగిందో చెప్పాలని పట్టుబట్టారు. సీనియర్‌ విద్యార్థి సైఫ్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రీతి ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని ప్రీతి తండ్రి డిమాండ్ చేశారు.

ప్రీతి మృతి వార్త తెలియడంతో విద్యార్థి సంఘాల నేతలు, బీజేపీ కార్యకర్తలు నిమ్స్‌ ఆసుపత్రికి చేరుకోవడంతో ఆదివారం రాత్రి అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అంబులెన్స్‌లో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా ప్రీతి బంధువులు, గిరిజన సంఘాలు, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌ను తరలించారు. మరోవైపు ప్రీతి తల్లిదండ్రులతో పోలీసులు చర్చించారు. చివరికి మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్‌కు తరలించేందుకు వారు ఒప్పుకోవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.

గాంధీ ఆసుపత్రి వద్ద కూడా వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శవపరీక్ష తమ సమక్షంలో జరగాలని ప్రీతి బంధువులు డిమాండ్‌ చేశారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. శవపరీక్ష పూర్తి అయిన అనంతరం కుటుంబ సభ్యులకు ప్రీతి మృతదేహాన్ని అప్పగించారు. అనంతరం మృతదేహాన్ని స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాకు తరలించారు.

ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. మొత్తం రూ. 30 లక్షల ఆర్థికసాయం అందిస్తామన్నారు. కుటుంబంలో ఒకరికి గెజిటెడ్‌ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News