Mahabubabad Municipal: మహబూబాబాద్ స్వేచ్ఛ: సమయం లేదు మిత్రమా.. ప్రచారంలో దూకుడే లక్ష్యంగా వార్డు కౌన్సిలర్లు దూసుకుపోతున్నారు. రేపటితో ప్రచారాలకు స్వస్తి పలికేలా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సమయంలోనే నేడు, రేపు అనుకున్న లక్ష్యంతో ముందుకు సాగి ఓటర్లను ఆకట్టుకుని గెలుపు కోసం వార్డు కౌన్సిలర్లు సాహసం చేస్తున్నారు. అకస్మాత్తుగా వచ్చిన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో అందరూ ప్రచార కార్యక్రమాలను ప్రణాళిక బద్దంగా చేపడుతున్నారు. డబ్బు, మద్యం, మార్బలంతో హంగామానే చేస్తున్నారు. ఓటర్ల తుది జాబితా మూడో తారీఖున ఖరారు కావడంతో అప్పటినుంచి అధికారిక ప్రచార పర్వంతో అభ్యర్థులు తమ తమ ప్రణాళికలతో తహతహ పడుతూ ఓటర్లను ఆకట్టుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈసారి ఎన్నికల్లో దాదాపు 50% మంది కొత్తవారు కావడం, అందులోనూ యువత ముందుకు రావడం మున్సిపాలిటీ ఎన్నికలకు కొత్త రూపు తీసుకొచ్చింది.
రేపటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి స్వస్తి.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పరిస్థితి వార్డు కౌన్సిలర్లకు వచ్చింది. దీంతో ఎంత మేరకు ఓటర్ దేవుళ్లను మెప్పించగలుగుతారో వారికి మాత్రమే గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. మైకులతో హంగామా సృష్టించిన వార్డు కౌన్సిలర్లు ఇకపై సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నిబంధన ప్రకారం ప్రచారం రేపటితో ముగుస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం విస్తృతంగా ప్రచార పరిస్థితి దూసుకుపోయే విధంగా అభ్యర్థులు ఫోకస్ చేసుకున్నారు. డబ్బు పని చేస్తుందా..? లేదంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..? అనే డైలమాలో వార్డు కౌన్సిలర్ల అభ్యర్థులు తేల్చుకోలేకపోతున్నారు. ఏది ఏమైనా డబ్బులు ఎక్కువగా ఓటర్లకు సమర్పించుకున్న వాళ్లకు మాత్రమే అవకాశం ఉంటుందని ఎప్పటినుంచో చూస్తున్న పరిస్థితి ఉంది. సెంటిమెంట్ ఒకటి రెండు లేదంటే అరకొరగా చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మంది మార్బలంతో అదేవిధంగా ఆ ప్రాంతంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల ప్రచారంతో వార్డు కౌన్సిలర్లు విస్తృతమైన ప్రచారం సాగిస్తున్నారు. ప్రజల నాడి ఎటువైపు ఉంది. వాళ్లని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి. అనే సందేహాల్లో అభ్యర్థులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విధంగా చేయగలిగితే గెలుపును సుసాధ్యం చేసుకోగలుగుతామనే ప్రణాళికతో అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. గతంలో గెలుపోటములను చెవిచూసిన అభ్యర్థులు నేడు గెలవడమే లక్ష్యంగా ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు.
అనుకున్నది అనుకున్నట్టుగా ఎన్నికల్లో జరగడం అసాధ్యం. అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలని లక్ష్యంతో ఏం చేయాలో అదే దిశగా ప్రయత్నాలు సాగిస్తూ సుసాధ్యం చేసుకునేలా వార్డు కౌన్సిలర్లు తమ ప్రణాళికలను రచించుకుంటున్నారు. గతంలో మంది మార్బలంతో ప్రచారం నిర్వహించే పరిస్థితి కనపడేది. నేడు ఎన్నికల నిబంధనలు పాటిస్తూనే తమ తమ సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఎన్నికల రోజు వరకు జరుపుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వార్డు కౌన్సిలర్లు వాట్స్అప్ గ్రూపులను క్రియేట్ చేసి అందులో ఆ వార్డుకు సంబంధించిన ఓటర్లందరినీ చేర్చి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు.