Weather Updates: రోహిణి ఎండలకు రాళ్లు పగులుతాయనే సామెత వినే ఉంటారు. రానున్న కాలం అలానే ఉండబోతోందా? ఇప్పుడే ఆ సెగ ప్రజలను తాకుతోందా? మొన్నటి వరకు తీవ్ర చలిగాలులు.. ఇప్పుడేమో భానుడి వేడి గాలులు.. అప్పుడే ఆ సెగ మొదలైందని ప్రజలు అనేస్తున్నారు. అప్పుడేమైంది.. ముందుంది మండే కాలం అంటున్నారు మరికొందరు.
రెండు తెలుగు రాష్ట్రాలలో మొన్నటి వరకు చలిగాలుల తాకిడి అధికంగా ఉండేది. చలిగాలుల ధాటికి ప్రజలు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తెలంగాణలోని ఆదిలాబాద్, ఏపీలోని అరకు ప్రాంతాలలో చలి ప్రభావం అధికంగా కనిపించింది. ఉదయం 11 గంటలకు తీవ్రమైన చలిగాలులను ఎదుర్కొన్న ప్రజలు, రాత్రి బయటకు వచ్చేందుకు కూడ సాహసించని రోజులు గడిచిపోయాయి. సాధారణంగా మహా శివరాత్రి తర్వాత ఎండ ప్రభావం పెరుగుతుందని చెప్తారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే అప్పటి వరకు కూడ కాలం ఆగేలా లేదు.
అప్పుడే భానుడి సెగ తాకిడి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ అధికారులు ప్రతి రోజూ ఇచ్చే ప్రకటనలు కూడ తేమ శాతం తగ్గిందని, ఎండల ఎఫెక్ట్ ఉండబోతోందని సూచిస్తున్నారు. ఉదయం 7 గంటలకే రెండు తెలుగు రాష్ట్రాలలో సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. మధ్యాహ్నం వేళ అయితే సూర్యుడి ప్రతాపం అధికంగా కనిపిస్తోంది. తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2 నుండి 5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. అంతేకాదు ఏపీలో కూడ ఉష్ణోగ్రతల పరిస్థితి ఇదే రీతిలో కనిపిస్తోంది. ఇటీవల కర్నూల్ జిల్లాలో 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇలా ఇప్పుడే అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే, రానున్న కాలం మరింత గడ్డు కాలమే అంటున్నారు ప్రజలు.
Also Read: MLC Elections on Volunteers: వైసీపీ ప్లానా? వాలంటీర్ల రివేంజా?
ఇంకా చలి కాలం వెళ్లక మునుపే ఈ రీతిలో ఎండల తాకిడి ఉంటే, మున్ముందు రహదారులపై ఆమ్లెట్ వేయాల్సిందే కొందరు. మొన్నటి వరకు విపరీత చలిగాలులు, ఇప్పుడే వేడి గాలుల ఎఫెక్ట్ కనిపిస్తుండగా.. రానున్న ఎండాకాలంలో రాళ్లు పగిలే రోజులు వస్తాయా అంటూ పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవని వైద్యులు కూడ హెచ్చరిస్తున్నారు. అధికంగా చిన్నారులు, వృద్దులు అధికంగా నీటిని తీసుకోవాలని, లేకుంటే శరీరంలో నీటి శాతం తగ్గి అనారోగ్య సమస్యలు పలకరిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. ఏదిఏమైనా ఎండా కాలం పలకరింపులు.. అప్పుడే మొదలయ్యాయి.. తస్మాత్ జాగ్రత్త సుమా.. లేకుంటే ఇబ్బందులు తప్పవు.