Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో హైదరాబాద్ ప్రాంతంలో మొత్తం ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. మంగళవారం నుంచి వర్షం మళ్లీ కురుస్తునే ఉండటంతో ప్రజలు బయటకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.
పలు ప్రాంతాల్లో వర్షపాతం..
బయట ఇక మెదక్ జిల్లా టెక్మల్‌లో 18.3 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. కామారెడ్డి జిల్లా శంకరంపేటలో 17.6 సెం.మీ వర్షపాతం, సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 15.3 సెం.మీ వర్షపాతం,యాదాద్రి జిల్లా భువనగిరిలో 13.2 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది, ఇక మహబూబ్‌నగర్ జిల్లా భూత్‌పూర్‌లో 9.5 సెం.మీ వర్షపాతం నమోదు అవ్వగా, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 8.1 సెం.మీ వర్షపాతం,రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 4.5 సెం.మీ వర్షపాతం, కామారెడ్డి జిల్లా, నాగిరెడ్డి పేటలో 16.8 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కుత్బుల్లాపూర్, పటాన్‌చెరు, కూకట్‌పల్లి,ముషీరాబాద్, కాప్రా, మల్కాజ్‌గిరిలో,అల్వాల్, ఖైరతాబాద్, ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తండగా, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ, కొండాపూర్ ప్రాంతాల్లోను వర్షం కురుస్తుంది.
తెలంగాణకు ఇవాళ, రేపు భారీ వర్ష సూచన..
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ములుగు, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నారాయణపేట్, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ నాగరత్న వెల్లడించారు. హైదరాబాద్‌లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షం..
తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తుంది. బుధ, గురువారాల్లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అప్రమత్తం చేసింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోని పోలాకిలో 11 సెంటీమీటర్లు, నరసన్నపేటలో 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసినట్లు తెలిపారు.
జాగ్రత్తలు..
భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు. అత్యవసర సమయాల్లో తప్ప ప్రజలు బయటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.