Bharat Summit: హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న ‘భారత్ సమ్మిట్’ పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు. సమ్మిట్‌లో పాల్గొనేందుకు వస్తున్న విదేశీ ప్రతినిధుల వీసాలను ఆఖరి నిమిషంలో రద్దు చేయడం అత్యంత అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు.
రాహుల్ గాంధీపై అక్కసుతోనే కేంద్రం కుట్రలు
రాజకీయ దురుద్దేశాలతో, రాహుల్ గాంధీపై ఉన్న అక్కసుతోనే కేంద్రం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గతంలో గుజరాత్‌లో ‘వైబ్రెంట్ గుజరాత్’ పేరుతో వేల కోట్ల ప్రభుత్వ సొమ్మును వాడలేదా అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీని కొత్తగా రీలాంచ్ చేయాల్సిన అవసరం లేదని, ఆయన ఇప్పటికే దేశవిదేశాల్లో ఎంతో ఆదరణ ఉన్న గొప్ప జననేత అని కొనియాడారు.
శాంతి సదస్సును రాజకీయం చేయొద్దు
గత ఏడాది కూడా ఇదే వేదికపై భారత్ సమ్మిట్ ఎంతో విజయవంతంగా జరిగిందని, అప్పుడు దేశ వ్యతిరేక అంశాలేమీ చర్చించలేదని గుర్తు చేశారు. గ్లోబల్ సౌత్ దేశాల ప్రతినిధులు, ప్రపంచ శాంతిని కోరుకునే నాయకులు పాల్గొనే ఈ అంతర్జాతీయ సదస్సును సంకుచిత రాజకీయాల కోసం వాడుకోవడం సిగ్గుచేటన్నారు. రాబోయే 72 గంటల్లో 7 అంతర్జాతీయ, 4 తెలంగాణ ప్రత్యేక ప్యానెల్ చర్చల్లో కరువు, ప్రపంచ సమస్యల వంటి కీలక అంశాలపై మేధోమథనం జరగనుందని వివరించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ‘కృత్రిమ కరువు’ అంటూ చౌకబారు రాజకీయాలు చేయడం మాని.. ఈ సమ్మిట్‌ను స్వాగతించాలని సూచించారు.
కేటీఆర్ పగటి కలలు కంటున్నారు..
మరోవైపు, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు. గత పదేళ్ల పాలనలో తాము చేసిన అరాచకాలను కేటీఆర్ మర్చిపోయారా అని నిలదీశారు. నిరుద్యోగులు, మహిళలు, యువతను దారుణంగా మోసం చేయడమే కాకుండా, కట్టిన కొద్ది రోజులకే కూలిపోయే డ్యామ్‌లు నిర్మించిన చరిత్ర వారిదని విమర్శించారు. ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఈ సదస్సుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎందుకు అంత నొప్పి కలుగుతుందో అర్థం కావడం లేదని మహేష్ కుమార్ గౌడ్ చురకలంటించారు.
Also Read: రెండు క్యాచ్ లు వదిలేసిన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్…బూతులు తిట్టిన గంభీర్!