Mahesh Goud: స్వేచ్ఛ బ్యూరో: రాజకీయాల్లో అత్యాశ పనికిరాదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ..ప్రజా స్వామ్యంలో కొత్త పార్టీలను స్వాగతించాల్సిన అవసరం ఉన్నదన్నారు. కవిత పార్టీ పెట్టినందుకు అభినందనలు తెలిపారు. కానీ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మర్చిపోవద్దని సూచించారు. 2014 నుంచి 2023 వరకు జరిగిన బీఆర్ఎస్ దోపిడీలో కవిత పాత్ర, భాగస్వామ్యం ఉన్నదన్నారు. దోపిడిపై కవిత ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదన్నారు. ఇక మహిళా సాధికారత కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుంటే, కవిత సీఎంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. ప్రజాపాలనలో మహిళా కేంద్రంగా అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందన్నారు.గ్రామ స్థాయి నుంచి పట్టణీకరణ వరకు ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారన్నారు.
ఎన్ని కొత్త పార్టీలువచ్చినా కాంగ్రెస్ పదేళ్ల పాటు పవర్ లో ఉంటుందన్నారు. కవిత చెప్తున్న గుంట నక్కలు, పంది కొక్కులు పదేళ్ల నుంచి లేరా? అంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. వాళ్లతోనే దందాలు చేసిన కవిత..ఇప్పుడు సీఎం పదవిపై ఆశతో బయటకు వచ్చి విమర్శలు చేస్తుందన్నారు.ఇక గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తీసుకున్న నిర్ణయంపై టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలుగా మాజీ క్రికెటర్ , తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ పేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభ పరిణామమని పేర్కొన్నారు.సమాజానికి సేవ చేసిన వ్యక్తులకు శాసన మండలిలో స్థానం కల్పించడం ప్రజాస్వామ్య వ్యవస్థ బలాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.
Also Read: రాఘవ్ చద్దాకు బిగ్ షాక్.. రాత్రికి రాత్రే 10 లక్షల మంది అన్ ఫాలో
ప్రజా జీవితం, క్రీడా రంగం, సామాజిక ఉద్యమాల్లో విశిష్ట సేవలు అందించిన అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ అవకాశం రావడం సముచిత నిర్ణయమని తెలిపారు.అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ పోషించిన పాత్ర చారిత్రాత్మకమని కొనియాడారు. ఉద్యమ దశలో ప్రజల ఆకాంక్షలను బలంగా వినిపించి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తీసుకెళ్లిన నాయకుల్లో కోదండరామ్ ఒకరని అన్నారు. అలాంటి వ్యక్తికి శాసన మండలిలో అవకాశం కల్పించడం రాష్ట్రానికి మేలు చేసే నిర్ణయమని అభిప్రాయపడ్డారు.ప్రజాస్వామ్యంలో వివిధ రంగాల అనుభవం ఉన్న వ్యక్తులు శాసనసభలు, శాసన మండలిలో ఉండటం ద్వారా పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రానికి ఉద్యమ అనుభవం, సామాజిక అవగాహన, ప్రజా సమస్యలపై స్పష్టత ఉన్న నాయకుల అవసరం ఎంతో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోందని, సమాజంలోని అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తోందని చెప్పారు. గవర్నర్ ఆమోదంతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం ప్రజాస్వామ్య పరిపక్వతకు నిదర్శనమని పేర్కొన్నారు.అజారుద్దీన్, కోదండరామ్‌లకు ఎమ్మెల్సీ పదవులు రావడం ద్వారా శాసన మండలి చర్చలు మరింత ప్రజా ప్రయోజనకరంగా మారుతాయని, రాష్ట్ర అభివృద్ధికి వారి అనుభవం ఉపయోగపడుతుందని మహేష్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: అధికారం పోయాకే గుంటనక్కలు గుర్తుకొచ్చాయా? కవితను ప్రశ్నించిన మహేష్ కుమార్ గౌడ్