Mahesh Kumar Goud: ప్రతిపక్ష నేత కేసీఆర్ కంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే సామాజిక స్పృహ ఎక్కువగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. సభాపతి స్థానంలో ఉన్న దళితుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ‘అధ్యక్షా’ అని పిలవాల్సి వస్తుందనే నెపంతోనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎప్పుడూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయలేదన్నారు. మహిళలు లేకుండా కేబినెట్‌ను నడిపిన చరిత్ర ఆయనదన్నారు.
దళిత స్పీకర్‌ను బీఆర్ఎస్ నాయకులు అవమానిస్తే కేసీఆర్ ఇప్పటివరకు ఖండించలేదని టీపీసీసీ చీఫ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగతమైనవి కావని, అది బీఆర్ఎస్ తయారుచేసిన స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని అన్నారు. గతంలో దళితుడైన భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతగా ఉంటే ఓర్చుకోలేక అనైతికంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆ పదవి పోయేలా చేశారని, అర్ధరాత్రి వేళ డాక్టర్ రాజయ్యను బర్తరఫ్ చేసిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. దేశ చరిత్రలోనే దళితులను అవమానించే సంస్కృతిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష నేతగా ఉండి ఏ రాష్ట్రంలోనూ ఏ నాయకుడు ఫామ్‌హౌస్‌కే పరిమితం కాలేదని కేసీఆర్‌ను ఉద్దేశించి మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములకు రక్షణ కల్పించేలా భూముల చట్టం ’22A’ను సమూలంగా సమీక్షించి, సవరణలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వంలో దళితులకు, బలహీన వర్గాలకు అత్యున్నత పదవులు కట్టబెట్టామని పేర్కొన్నారు.
Also Read: అపరిచితుల మధ్య రాత్రికి రాత్రే పుట్టే అందమైన ప్రేమ… మనసును హత్తుకునే మధురమైన లవ్ స్టోరీ
త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుందని టీపీసీసీ చీఫ్ వెల్లడించారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ అలాగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానాలకు సంబంధించి ఒక్కో సెగ్మెంట్ నుంచి నలుగురేసి పేర్లను పరిశీలిస్తున్నామని చెప్పారు. రెండు మూడు రోజుల్లో అభ్యర్థుల పేర్లను అధికారికంగా ఫైనల్ చేస్తామని తెలిపారు. మరోవైపు తాను మంత్రి పదవిని కోరుకోలేదని, ఆ విషయంపై తనను ఎవరూ సంప్రదించలేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడటమే తమ అందరి ఏకైక ఆకాంక్ష అని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.
Also Read: Sony vs Bose.. ఈ రెండింటిలో ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంటే మీ డబ్బులు వృధా కావు?