Telangana High Court: కోర్టు ధిక్కరణ పిటిషన్లలో బెయిలబుల్ వారెంట్ జారీ అయినా ఐఏఎస్ అధికారులు కోర్టుకు గైర్హాజరు కావటంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ విచారణకు రాకపోవటాన్ని తీవ్రంగా పరిగణించింది. కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు జారీ అయ్యాక విదేశాలకు ఎలా వెళతారని? ప్రశ్నించింది. ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుందని వ్యాఖ్యానించింది. ఉన్నతస్థానంలో ఉన్న అధికారులకు కోర్టు ధిక్కరణ పిటిషన్లలోని సాధారణ నిబంధనలు కూడా తెలియవా? అని హైకోర్టు నిలదీసింది. ఇంకోసారి ఇలాంటివి పునరావృతమైతే ఉపేక్షించబోమని హెచ్చరించింది.
భూసేకరణ పరిహారానికి సంబంధించి కింది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని సదరు అధికారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. భూసేకరణ పరిహారంలో భాగంగా నిర్ణయించిన మొత్తంలో 50 శాతాన్ని 3 నెలల్లో డిపాజిట్ చేయాలంటూ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన నాగిరెడ్డి, మరొకరు సంబంధిత అధికారులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ధిక్కరణ కింద సదరు అధికారులను న్యాయస్థానంలో హాజరు కావాలని ఆదేశించింది. అయినా, అధికారులు గైర్హాజరు కావడంతో అధికారులపై గత వారం బెయిలబుల్ వారెంట్స్ జారీ అయ్యాయి.
అయితే ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదని, ధర్మాసనం ఆదేశాలను అమలు చేశామని అధికారులు వారెంట్ రీకాల్ చేశారు. హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అసెంబ్లీ సమావేశాలుండటంతో కోర్టుకు హాజరుకాలేకపోయారనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేశాక అధికారులు హాజరు కావడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారని ప్రశ్నించారు. కనీసం ఆన్ లైన్లో కూడా హాజరు కావడంలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక కోర్టు ఉదాసీనంగా ఉండబోదన్నారు. గైర్హాజరు పిటిషన్లను అనుమతించబోమని, అలా చేస్తే వారు సాధారణ అంశంగా పరిగణించే అవకాశముందని వ్యాఖ్యానించారు.
Also Read: మగ జీవులను నీచంగా చూసే.. భయంకరమైన ఆడ జంతువులు.. ఇవి చాలా డేంజర్ భయ్యా!
భూములు తీసుకున్నాక కనీసం 50 శాతం కూడా చెల్లించకపోతే ఎలా అని నిలదీశారు. ఉత్తర్వులు అమలైనప్పటికీ కోర్టు ధిక్కరణ ముగిసిపోదని గుర్తించాలంటూ హెచ్చరించారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులే ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. మరోసారి ఇది పునరావృతం కాకూడదని హెచ్చరించారు. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేశామని, కోర్టు ధిక్కరణ విచారణలో క్షమాపణ కోరుతున్నామని ఇద్దరు అధికారులు అఫిడవిట్లు దాఖలు చేయడంతో విచారణను ముగించారు.
Also Read: నా బంగారు విగ్గు ముట్టుకుంటే తిట్టనా? ఓ తాతా .. ఓ విగ్గు కథ.. మధుకు మంటెక్కింది అందుకేనా?