Malkaram Quarry: స్వేచ్ఛ బ్యూరో: మల్కారం క్వారీలో జరిగిన ఒక విషాద ఘటన అందరినీ కలచివేసింది. ఇంజినీరింగ్ చదువుల నిమిత్తం దూర ప్రాంతంలో ఉంటున్న ఒక యువకుడు, ఇంటికి వచ్చిన కొద్దిరోజులకే అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి..
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కీసర మండల పరిధిలోని మల్కారం క్వారీ వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. దమ్మాయిగూడ సాయిప్రియ కాలనీకి చెందిన ముమ్మారెడ్డి ప్రణవ్ సాయి (17) చీరాలలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం నాడు సాయంత్రం వేళ ప్రణవ్ తన స్నేహితులతో కలిసి సరదాగా మల్కారం క్వారీ వైపు వెళ్లాడు. అక్కడ వారంతా కలిసి నీటిలోకి దిగి ఈత కొడుతుండగా, అనుకోకుండా ప్రణవ్ సాయి లోతులోకి వెళ్లి నీటిలో మునిగిపోయాడు.
పోలీసుల దర్యాప్తు..
సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న తల్లి హేమలత కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆమె తన కుమారుడి స్నేహితులను ఆరా తీయగా.. ఈత కొడుతుండగా ప్రణవ్ నీటిలో మునిగిపోయినట్లు వారు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి నీటిలో తీవ్రంగా గాలించగా.. ప్రణవ్ సాయి విగతజీవిగా బయటపడ్డాడు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తల్లి ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కంటికి రెప్పలా పెంచుకున్న ఏకైక కుమారుడు ఇలా విగతజీవిగా మారడంతో ఆ తల్లి రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.
Also Read: బతుకమ్మ వేదికగా గులాబీ వ్యూహం.. కవితకు చెక్ పెట్టేలా బీఆర్‌ఎస్ ప్లాన్!